Drones: గద్దలతో డ్రోన్లకు చెక్.. భారత సైన్యం కొత్త ఎత్తుగడ
- సరిహద్దుల్లో డ్రోన్ల బెడద
- పాకిస్థాన్ వైపు నుంచి డ్రోన్ల రాక
- డ్రోన్లను కూల్చివేసేలా గద్దలకు భారత ఆర్మీ శిక్షణ
- భారత్-అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు
- డ్రోన్ ను గద్ద కూల్చివేయడంపై ప్రత్యేక ప్రదర్శన
ఇటీవల కాలంలో పాకిస్థాన్ సరిహద్దులకు ఆవల నుంచి భారత గగనతలంలోకి డ్రోన్లు చొరబడడం ఎక్కువైంది. వాటిని సరిహద్దు భద్రతా బలగాలు కూల్చివేస్తున్నప్పటికీ, భారత సైన్యం ప్రత్యామ్నాయంగా గద్దలను రంగంలోకి దించుతోంది. గాల్లో ఎగిరే డ్రోన్లను అడ్డుకోవడానికి గద్దలకు శిక్షణ ఇస్తోంది. డ్రోన్లను కట్టడి చేసేందుకు గద్దలను ఉపయోగించడం ఇదే ప్రథమం.
భారత్, అమెరికా సంయుక్తంగా చేపడుతున్న సైనిక విన్యాసాలు యుద్ధ్ అభ్యాస్ లో భాగంగా గద్దలు డ్రోన్లను కూల్చివేయడాన్ని ప్రదర్శించారు.
ఓ డ్రోన్ ను ఆర్మీ సిబ్బంది గాల్లో ఎగురవేయగా, ఆర్మీకే చెందిన ఓ శునకం దాన్ని గుర్తించి సిబ్బందిని అప్రమత్తం చేసింది. వెంటనే సిబ్బంది తమ వద్ద ఉన్న శిక్షణ పొందిన గద్దను డ్రోన్ దిశగా గాల్లోకి వదిలారు. ఆ గద్ద డ్రోన్ ను గుర్తించి విజయవంతంగా నేలకూల్చింది. ఆ గద్ద పేరు అర్జున్. డ్రోన్లను గుర్తించడంలో గద్దలకే కాదు శునకాలకు కూడా భారత సైన్యం శిక్షణ ఇచ్చింది.