sexual health: లైంగిక జీవితం బాగుండాలంటే.. ఇవి పాటించాలి!
- రోజువారీ వ్యాయామం చేస్తూ చురుగ్గా ఉండాలి
- జంక్ ఫుడ్ బదులు పోషకాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి
- ఒత్తిళ్లను తగ్గించుకోవాలి.. మద్యపానానికి దూరంగా ఉండాలి
సంతాన సాఫల్యత విషయంలో లైంగిక ఆరోగ్యం పాత్ర ఎంతో ఉంటుంది. పురుషుల వీర్య కణాల నాణ్యత, చురుకైన కణాల సంఖ్య కీలక పాత్ర పోషిస్తాయి. చురుకైన కణాల సంఖ్య తక్కువగా ఉంటే సాఫల్యత అవకాశాలు కూడా తగ్గిపోతాయి. జీవనశైలి, కొన్ని రకాల అలవాట్లు పురుషుల లైంగిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయని వైద్యులు అంటున్నారు.
నిశ్చలమైన జీవనం
శారీరకంగా చురుగ్గా ఉండడం అవసరం. ముఖ్యంగా యువకులు అయితే రోజువారీగా వ్యాయామాలు అలవాటు చేసుకోవాలి. వారంలో కనీసం ఐదు రోజుల పాటు అయినా 30 నిమిషాల చొప్పున వ్యాయామం చేయాలి. దీనివల్ల శారీరక సామర్థ్యం, రోగ నిరోధక శక్తి పెరుగుతాయి. సంతాన సాఫల్యత అవకాశాలు కూడా పెరుగుతాయి.
మద్యపానం
రోజువారీగా ఆల్కహాల్ తాగడం పురుషుల సంతాన సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందనడంలో సందేహం లేదు. వెంటనే కనిపించకపోయినా, కొంత కాలానికి దీని తాలూకు దుష్ప్రభావాలు కనిపిస్తాయి. ఆల్కహాల్ తాగితే టెస్టోస్టెరోన్ తగ్గిపోతుంది. పురుషుల లైంగిక సామర్థ్యానికి టెస్టోస్టెరోన్ ఎంతో ముఖ్యం. కనుక వీర్య ఉత్పత్తి కూడా తగ్గుతుంది. అందుకని ఆల్కహాల్ అలవాటు మానేయడం, లేదంటే చాలా వరకు తగ్గించుకోవడం తప్పనిసరి.
ఒత్తిడి
ఇక పని ఒత్తిడి కూడా నష్టాన్ని చేకూరుస్తుంది. వీర్యాన్ని ఉత్పత్తి చేయాల్సిన హార్మోన్లపై ఒత్తిడి ప్రభావం పడుతుంది. వీర్య సాంద్రత తగ్గుతుంది. యోగా, ప్రాణాయామం ద్వారా ఒత్తిళ్లను తగ్గించుకోవచ్చు. మనసుకు నచ్చిన పనులు చేయడం వల్ల కూడా ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు.
స్థూలకాయం/పోషకాహారం
అధిక బరువు కూడా సంతాన అవకాశాలకు ప్రతిబంధకంగా మారుతుంది. ఇది స్త్రీ, పురుషులు ఇరువురికీ వర్తిస్తుంది. స్థూలకాయం వీర్యకణాల నాణ్యతను ప్రభావితం చేస్తుంది. అందుకే జంక్ ఫుడ్ తీసుకోకూడదు. ప్రాసెస్డ్ మాంసం తినేవారిలో, తినని వారితో పోలిస్తే ఆరోగ్యకరమైన వీర్యకణాలు తక్కువగా ఉంటున్నట్టు ఇటీవల ఓ అధ్యయనం గుర్తించింది. అందుకని ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం సంతాన సాఫల్యతను పెంచుతుంది.