Nara Lokesh: రాష్ట్రానికి పట్టిన జగనోరా వైరస్ కి టీడీపీయే వ్యాక్సిన్: నారా లోకేశ్

TDP is vaccine for Jaganora virus says Nara Lokesh

  • మమ్మల్ని చంపుతామని వైసీపీ ఎమ్మెల్యే సోదరుడు బెదిరిస్తున్నారన్న లోకేశ్ 
  • జగన్ పాలన చూసి పరిశ్రమలు రావడం లేదని విమర్శ 
  • వైసీపీ భూకబ్జాలను చూసి విశాఖ ప్రజలు ఆలోచించాలన్న లోకేశ్ 

రాష్ట్రానికి పట్టిన జగనోరా వైరస్ ను వదిలించాలంటే టీడీపీ వ్యాక్సిన్ వేయాల్సిందేనని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు మమ్మల్ని చంపుతామని బెదిరిస్తున్నాడని... అలాంటి బెదిరింపులకు భయపడేవారు ఎవరూ లేరని చెప్పారు. వైఎస్ వివేకా హత్య కేసులో తమపై జగన్ గ్యాంగ్ ఆరోపణలు చేసిందని... ఆ హత్యతో సంబంధం లేదని తిరుపతిలో తాను ప్రమాణం చేశానని... వైసీపీ నేతలు ప్రమాణం చేయకుండా పారిపోయారని ఎద్దేవా చేశారు. వివేకాను హత్య చేసింది ఎవరో దీంతో తేటతెల్లమయిందని అన్నారు. 

మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లిలో నిర్వహించిన 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమంలో లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ రెడ్డి రాష్ట్రానికి పట్టిన ఖర్మ అని లోకేశ్ అన్నారు. జగన్ రెడ్డి విధ్వంస పాలనను చూసి కొత్త పరిశ్రమలు రావట్లేదని, ఉన్నవి తరలిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తన కేసుల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన జగన్ ముఖ్యమంత్రి కావడం రాష్ట్ర ప్రజల ఖర్మ అని ఆరోపించారు. అమరాతికి అనుకూలమని చెప్పి, అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు ముక్కలాటకు తెరతీశారని మండిపడ్డారు. వైసీపీ పెద్దల భూకబ్జాలను చూసిన తరువాతైనా విశాఖ ప్రజలు ఆలోచించాలని చెప్పారు. 

అమరావతిలోనే హైకోర్టు ఉంటుందని జగన్ తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారని... న్యాయ రాజధాని పేరుతో కర్నూలు ప్రజలను కూడా మోసగించిన జగన్ అసలు స్వరూపం బట్టబయలయిందని లోకేశ్ అన్నారు. ఏ ఊరు వెళ్లినా, ఏ వీధిలో పర్యటించినా.. ప్రజలు ఇదేం పాలన, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అని బాధపడుతున్నారని.. ఇంతటి ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న వైసీపీ సర్కారు త్వరలోనే దిగిపోక తప్పదని చెప్పారు.

  • Loading...

More Telugu News