fifa world cup: ఫిఫా ప్రపంచ కప్ లో మరో సంచలనం
- ఫ్రాన్స్ ను ఓడించిన ట్యునీషియా జట్టు
- అయినా ఫ్రాన్స్ ముందుకు.. ట్యునీషియా ఇంటికి
- డెన్మార్క్‌పై గెలిచి నాకౌట్ చేరిన ఆస్ట్రేలియా
ఫిఫా ప్రపంచ కప్ లో మరో సంచలనం నమోదైంది. వరుసగా రెండు విజయాలతో అందరికంటే ముందే ప్రిక్వార్టర్స్ బెర్తు దక్కించుకున్న డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ కు ఆఖరి లీగ్ మ్యాచ్ లో అనామక ట్యునీషియా షాకిచ్చి మెగా టోర్నీలో సంచలనం రేపింది. బుధవారం రాత్రి జరిగిన ఈ పోరులో ట్యునీషియా 1-0తో ఫ్రాన్స్‌ను ఓడించింది.
అయితే, మరో మ్యాచ్‌లో డెన్మార్క్‌ను ఆస్ట్రేలియా ఓడించడంతో ట్యునీషియాకు నాకౌట్ బెర్తు దూరమైంది. అయినా, తమ దేశ చరిత్రలో గుర్తుండిపోయే విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఆఖరి క్షణం వరకూ ఉత్కంఠగా సాగిన ఈ పోరులో బంతిని ఎక్కువగా తమ అధీనంలోనే ఉంచుకున్నా, ఎన్నో దాడులు చేసినా ఫ్రాన్స్ ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. తొలి అర్ధ భాగంలో ఇరు జట్లూ ఖాతా తెరువలేకపోయాయి.
అయితే, రెండో అర్ధభాగంలో ట్యునీషియా మాయ చేసింది. 58వ నిమిషంలో లౌడౌని నుంచి పాస్ అందుకున్న వాబి ఖజ్రి ఆ జట్టుకు గోల్ అందించాడు. దాంతో, ఆటలో వెనుకబడ్డ ఫ్రాన్స్ తర్వాత పుంజుకోలేకపోయింది. చివర్లో తమ గోల్ పోస్ట్‌ను వదిలేసిన ఫ్రాన్స్ ఆటగాళ్లు పూర్తిగా ఎదురుదాడి చేసినా ఫలితం లేకపోయింది. అదనపు సమయం చివర్లో గ్రీజ్‌మన్ గోల్ చేసినప్పటికీ రివ్యూలో రిఫరీ దాన్ని ఆఫ్‌సైడ్‌గా ప్రకటించడంతో ఫ్రాన్స్‌కు ఓటమి తప్పలేదు.
2014 వరల్డ్‌కప్ క్వార్టర్ ఫైనల్ తర్వాత మెగా టోర్నీలో ఫ్రాన్స్‌కు ఇదే తొలి ఓటమి కావడం గమనార్హం. ఇక, మరో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 1–0తో డెన్మార్క్‌పై విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకుంది. 60వ నిమిషంలో మాథ్యూ లెకీ ఆసీస్‌కు గోల్ అందించాడు. ఈ ఫలితం ట్యునీషియా నాకౌట్ అవకాశాలపై నీళ్లు కుమ్మరించినట్టయింది.