Twitter: యాపిల్ విషయంలో మాట మార్చిన మస్క్

Apple never considered removing Twitter from App Store says Elon Musk after meeting Tim Cook
  • యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తో భేటీ అయిన ట్విట్టర్ అధినేత
  • ప్లే స్టోర్ నుంచి ట్విట్టర్ ను తొలగిస్తామని యాపిల్ బెదిరిస్తోందని ఇది వరకు ట్వీట్ చేసిన మస్క్
  • ఇప్పుడు అలాంటి ఆలోచనే యాపిల్ చేయలేదని ప్రకటన
ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు, ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ మాట మార్చారు. టెక్ దిగ్గజం యాపిల్ పై యుద్ధాన్ని ప్రకటించిన ఆయన వెనక్కు తగ్గారు. కొన్ని రోజుల కిందట యాపిల్ పై మస్క్ పలు ఆరోపణలు చేశారు. ట్విట్టర్ లో యాపిల్ తమ ప్రకటనల్ని నిలిపేసిందన్నారు. అలాగే, తమ యాప్ స్టోర్ నుంచి ట్విట్టర్ ను తొలగిస్తామని యాపిల్ సంస్థ బెదిరిస్తోందని ఆరోపించారు. అసలేం జరుగుతోందని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ను ప్రశ్నిస్తూ ట్వీట్లు చేశారు. యాప్ స్టోర్ నుంచి ట్విట్టర్ ను తొలగిస్తే.. తానే మొబైల్ ఫోన్ల రంగంలోకి దిగుతానని కూడా ప్రకటించారు. 

ఈ క్రమంలో మస్క్ యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తో భేటీ అయ్యారు. యాపిల్ ప్రధాన కార్యాలయంలో కుక్ ను కలిసి తర్వాత మస్క్ మాట మార్చేశారు. అసలు యాపిల్ తమ యాప్ స్టోర్ నుంచి ట్విట్టర్ ను తొలగించాలని ఎప్పుడూ అనుకోలేదని చెప్పారు. టిమ్ కుక్‌తో సమావేశమైన తర్వాత మస్క్ ట్విట్టర్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ‘మా ఇద్దరి మధ్య మంచి సంభాషణ జరిగింది. ఇతర విషయాలతోపాటు, యాప్ స్టోర్ నుంచి తొలగించే అవకాశం ఉన్న ట్విట్టర్ గురించిన అపార్థాన్ని మేము పరిష్కరించాము. యాపిల్ ఎప్పుడూ అలా భావించలేదని టిమ్ స్పష్టంగా చెప్పారు’ అని మస్క్ ట్వీట్ చేశారు.
Twitter
Elon Musk
apple
tim cook

More Telugu News