Krishnavamsi: 'ఖడ్గం' సినిమాను ఇప్పుడు తీయలేం: కృష్ణవంశీ
- కృష్ణవంశీ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రంగా 'ఖడ్గం'
- దేశభక్తి నేపథ్యంలో రూపొందిన చిత్రం
- నవంబర్ 29వ తేదీతో 20 ఏళ్లు పూర్తి
- ఆ సినిమా గురించిన అనుభవాలు పంచుకున్న కృష్ణవంశీ
కృష్ణవంశీ తెరకెక్కించిన సినిమాలు వినోదంతో పాటు సామాజిక సందేశాన్ని కూడా ఇస్తుంటాయి. అలాంటి సినిమాలలో 'ఖడ్గం' ఒకటి. 2002 నవంబర్ 29వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రవితేజ .. సంగీత .. శ్రీకాంత్ ... సోనాలి బింద్రే .. ప్రకాశ్ రాజ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, నవంబర్ 29వ తేదీతో 20 ఏళ్లను పూర్తిచేసుకుంది.
ఈ నేపథ్యంలో చేసిన ఇంటర్వ్యూలో కృష్ణవంశీ మాట్లాడుతూ .. ''ఖడ్గం సినిమాను తీయడం నిజంగా ఒక సాహసమే. ఈ రోజుల్లో అయితే ఈ కథను టచ్ చేయలేము. మనోభావాలు దెబ్బతిన్నాయనడం .. మీడియా దానిని మరింత ఎక్కువ చేసి చూపించడం .. ఇంకా అల్లరి చేయడం జరిగేవి" అన్నారు.
'ఖడ్గం' గొప్ప సినిమా అని చెప్పలేంగానీ .. ఒక మంచి సినిమా అని మాత్రం చెప్పగలను. కథను మంచి ఎంజాయ్ చేస్తూ షూటింగు చేశాము. ఇది ఒక హీరో ... ఒక విలన్ సినిమా కాదు. తప్పకుండా సక్సెస్ ను సాధిస్తుంది అనే నమ్మకాన్ని కలిగించే ఫార్ములా కాదు. అప్పట్లో ఆ బడ్జెట్ లో ఈ సినిమాను తీయడం నిజంగా రిస్క్ అనే చెప్పాలి.
"నేను అనే స్వార్థం పెరిగిపోతున్న రోజుల్లో .. మనలను మోస్తున్న ఈ భూమికోసం .. మరణం తరువాత మనలను తనలో కలిపేసుకుంటున్న ఈ నేల కోసం మనమేం చేయాలనే ఒక దేశభక్తి నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించాము. అందుకు తగిన ప్రతిఫలం లభించినందుకు ఆనందంగా అనిపించింది" అంటూ చెప్పుకొచ్చారు.