Telangana: మునిగిపోయే కాంగ్రెస్ కు మేమెందుకు మద్దతు ఇవ్వాలి?: సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు
- టీఆర్ఎస్ తో పొత్తు శాశ్వతమేమీ కాదన్న కూనంనేని
- పాలేరు లాంటి నియోజకవర్గాల్లో గెలిచేందుకు యత్నం
- ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా ఎర్రజెండాలు కనిపిస్తాయని వ్యాఖ్య
తెలంగాణలో రాజకీయ పొత్తులకు సంబంధించి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గురువారం పలు వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే ముగిసిన మునుగోడు ఉప ఎన్నికల్లో వామపక్ష పార్టీలు అధికార టీఆర్ఎస్ కు మద్దతు పలికిన సంగతి తెలిసిందే. ఈ కారణంగానే మునుగోడు ఉప ఎన్నికను టీఆర్ఎస్ సులభంగానే గెలుచుకుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రజల పక్షాన పోరాటం సాగించే వామపక్షాలు అధికార పార్టీలకు ఎలా మద్దతు పలుకుతాయని ఎన్నికల నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. వీటిన్నింటికీ సమాధానం ఇస్తూ కూనంనేని గురువారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
టీఆర్ఎస్ తో పొత్తు శాశ్వతమేమీ కాదని కూనంనేని సాంబశివరావు తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తో పొత్తు ఉంటుందని ఇప్పుడే చెప్పలేమని కూడా ఆయన తెలిపారు. తమకు మంచి పట్టు ఉన్న పాలేరు లాంటి నియోజకవర్గాల్లో గెలిచేందుకు యత్నిస్తామని చెప్పారు. ఇక కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యలపై స్పందించిన కూనంనేని... ముగినిపోయే కాంగ్రెస్ కు తామెలా మద్దతిస్తామని అన్నారు. ఎర్ర జెండాలు ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా కనిపిస్తాయని ఆయన అన్నారు.