England: తొలిరోజే 500లకు పైగా పరుగులు... పాకిస్థాన్ తో టెస్టులో చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్

England creates world record by highest total in 1st day of a test
  • రావల్పిండిలో పాకిస్థాన్, ఇంగ్లండ్ మధ్య టెస్టు
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
  • ఆట చివరికి 4 వికెట్లకు 506 రన్స్ చేసిన స్టోక్స్ సేన
  • సెంచరీలు బాదిన నలుగురు బ్యాటర్లు
  • 112 ఏళ్ల ఆస్ట్రేలియా రికార్డు తెరమరుగు
రావల్పిండిలో పాకిస్థాన్ తో నేడు ప్రారంభమైన మొదటి టెస్టులో ఇంగ్లండ్ చరిత్ర సృష్టించింది. ఓ టెస్టు మ్యాచ్ తొలిరోజే 500 పరుగులు చేసిన మొదటి జట్టుగా రికార్డు నెలకొల్పింది. ఆస్ట్రేలియా పేరిట 112 ఏళ్లుగా పదిలంగా ఉన్న ఈ రికార్డును ఇంగ్లండ్ నేడు బద్దలు కొట్టింది. 1910లో దక్షిణాఫ్రికాపై ఆసీస్ జట్టు తొలిరోజున 494 పరుగులు చేసింది. అయితే ఈ రికార్డును బెన్ స్టోక్స్ నాయకత్వంలోని ఇంగ్లండ్ జట్టు తెరమరుగు చేసింది.  

రావల్పిండిలో ఇవాళ ప్రారంభమైన మొదటి టెస్టులో ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సందర్భంగా ఇంగ్లండ్ టాపార్డర్ ఆటగాళ్లు ఆతిథ్య పాకిస్థాన్ బౌలింగ్ లను చీల్చిచెండాడారు. వెలుతురు లేమి కారణంగా తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 75 ఓవర్లలో 4 వికెట్లకు 506 పరుగులు చేసింది. ఏకంగా నలుగురు బ్యాట్స్ మెన్ సెంచరీలు చేయడం విశేషం. 

ఓపెనర్లు జాక్ క్రాలే (122), బెన్ డకెట్ (107) తొలి వికెట్ కు 233 పరుగుల భారీ భాగస్వామ్యంతో పటిష్ఠ పునాది వేయగా, ఆ తర్వాత వచ్చిన వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ఓలీ పోప్ (108) కూడా శతకం సాధించాడు. మాజీ సారథి జో రూట్ 23 పరుగులకే అవుట్ కాగా, తొలి రోజు ఆట చివర్లో కొత్త కుర్రాడు హ్యారీ బ్రూక్ (101 బ్యాటింగ్) కూడా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతడికి జోడీగా క్రీజులో బెన్ స్టోక్స్ ఉన్నాడు. దూకుడుగా ఆడుతున్న స్టోక్స్ 15 బంతుల్లోనే 34 పరుగులు చేశాడు.

టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిరోజు హయ్యస్ట్ టోటల్స్ ఇవే...

502/4- ఇంగ్లండ్ వర్సెస్ పాకిస్థాన్ (రావల్పిండి 2022)
494/6- ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా (సిడ్నీ 1910)
482/5- ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా (అడిలైడ్ 2012)
475/2- ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియా (ఓవల్ 1934)
471/8- ఇంగ్లండ్ వర్సెస్ ఇండియా (ఓవల్ 1936)
England
World Record
Highest Total
1st Day
Test
Pakistan

More Telugu News