India: ప్రజాస్వామ్యంపై ఎవరితోనో చెప్పించుకునే స్థితిలో మేము లేము: ఐక్యరాజ్యసమితిలో భారత్
- ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నాగరికత మాదే అన్న భారత్
- 2,500 ఏళ్ల క్రితమే తమ దేశంలో ప్రజాస్వామ్యం ఉందని వ్యాఖ్య
- ఎప్పటికీ తమది అతి గొప్ప ప్రజాస్వామ్యం అన్న ఇండియా
ప్రజాస్వామ్యంపై ఏం చేయాలనే విషయంలో ఎవరితోనో చెప్పించుకునే స్థితిలో తాము లేమని, తమకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదని ఐక్యరాజ్యసమితిలో భారత్ స్పష్టం చేసింది. ఐక్యరాజ్యసమితి విభాగాల్లో అత్యంత బలమైన భద్రతామండలికి ఈ నెలలో ఇండియా అధ్యక్ష బాధ్యతలను చేపట్టింది. 15 సభ్య దేశాలున్న భద్రతామండలికి ఈ నెల ఎలెక్టెడ్ నాన్ పర్మనెంట్ మెంబర్ హోదాలో అధ్యక్ష విధులను భారత్ చేపట్టింది. ప్రెసిడెంట్ సీట్ లో భారత మహిళా ప్రతినిధి రుచిరా కాంబోజ్ కూర్చున్నారు. ఐక్యరాజ్యసమితికి ఎంపికైన తొలి మహిళా శాశ్వత ప్రతినిధి రుచిరా కావడం గమనార్హం.
ఈ సందర్భంగా భారత్ లో ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆమె బదులిస్తూ... ప్రజాస్వామ్యంపై ఏం చేయాలో తమకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నాగరికత భారత్ దే అనే విషయం మీ అందరికీ తెలిసిందేనని చెప్పారు. 2,500 ఏళ్ల క్రితమే భారతదేశంలో ప్రజాస్వామ్య పునాదులు ఉన్నాయని అన్నారు. ఎప్పటికీ భారత్ అతి గొప్ప ప్రజాస్వామ్య దేశమని చెప్పారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థతో పాటు ఫోర్త్ ఎస్టేట్ అయిన ప్రెస్ అనే నాలుగు పిల్లర్లపై తమ ప్రజాస్వామ్య వ్యవస్థ పరిఢవిల్లుతోందని తెలిపారు. భారత్ లో సోషల్ మీడియా కూడా అత్యంత చురుకుగా ఉందని చెప్పారు. అందుకే ప్రపంచంలోనే భారత్ అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా ఉందని అన్నారు.
ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రపంచంలోనే అతి పెద్ద డెమోక్రటిక్ ఎక్సర్ సైజ్ (ఎలెక్షన్స్) ను తాము నిర్వహిస్తామని ఆమె తెలిపారు. ప్రజలకు వారికి ఇష్టమైన వారికి ఓటు వేసే స్వేచ్ఛ ఉంటుందని... తమ దేశంలో ప్రజాస్వామ్యం ఇంత గొప్పగా కొనసాగుతోందని చెప్పారు. ప్రపంచంలో ఎంతో మంది ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారని తెలిపారు.