New York: ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాల జాబితా విడుదల!
- ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలుగా న్యూయార్క్, సింగపూర్
- గతేడాది మొదటి ర్యాంకుల్లో ఉన్న టెల్ అవీవ్ కు మూడో స్థానం
- చిట్ట చివరన డమాస్కస్, ట్రిపోలి
ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరంగా న్యూయార్క్ సిటీ మొదటి స్ధానంలో నిలిచింది. ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ వార్షిక సర్వే ఈ వివరాలను ప్రకటించింది. ఇంధన ధరలు పెరిగిపోయి, ద్రవ్యోల్బణం గరిష్ఠాలకు చేరిన తరుణంలో న్యూయార్క్ నగర జీవనం మరింత ఖరీదుగా మారిపోయింది. గడిచిన పదేళ్లలో ఎనిమిది పర్యాయాలు అత్యంత ఖరీదైన నగరంగా ఉన్న సింగపూర్ ఈ విడత న్యూయార్క్ తో కలసి మొదటి స్థానాన్ని ఆక్రమించింది.
గతేడాది మొదటి స్థానంలో ఉన్న టెల్ అవీవ్ ఈ ఏడాది ర్యాంకుల్లో మూడో స్థానానికి పరిమితమైంది. హాంగ్ కాంగ్ 4, లాజ్ ఏంజెలెస్ 5, జూరిచ్ 6, జెనీవా 7, శాన్ ఫ్రాన్సిస్కో 8, ప్యారిస్ 9, సిడ్నీ, కోపెన్ హెగెన్ 10వ స్థానాల్లో ఉన్నాయి. నివాస వ్యయం తక్కువగా ఉన్న టాప్ 10 నగరాల్లో.. డమాస్కస్ 172, ట్రిపోలి 171, టెహ్రాన్ 170, ట్యూనిస్ 169, తాష్కెంట్ 168, కరాచీ 167, ఆల్మెటీ 166, అహ్మదాబాద్ 165, చెన్నై 164, అల్జీర్స్ 161, బెంగళూరు 161, కొలంబో 161వ స్థానాల్లో ఉన్నాయి.
ప్రపంచంలోని పెద్ద పట్టణాల్లో సగటు జీవన వ్యయం 8 శాతం మేర పెరిగింది. ఇస్తాంబుల్ లో 86 శాతం, బ్యూనోస్ ఎయిర్స్ లో 64 శాతం, టెహ్రాన్ లో 57 శాతం మేర ధరలు పెరిగాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ఠాలకు చేరడంతో న్యూయార్క్ మొదటి స్థానంలో నిలవడానికి కారణమైంది.