Eluru District: ఆయిల్‌పాం తోటలో పురాతన బంగారు నాణేలు.. రెండు శతాబ్దాల నాటివిగా గుర్తింపు
- ఏలూరు జిల్లాలోని ఏడువాడల పాలెంలో ఘటన
- పైపులైను కోసం తవ్వుతుండగా బయటపడిన మట్టిపిడత
- ఒక్కోటి 8 గ్రాములపైగా ఉన్న 18 పురాతన నాణేలు లభ్యం
ఏలూరు జిల్లాలోని ఓ గ్రామంలో ఆయిల్‌పాం తోటలో రెండు దశాబ్దాల క్రితం నాటివిగా భావిస్తున్న 18 బంగారు నాణేలు బయటపడ్డాయి. కొయ్యలగూడెం మండలం ఏడువాడల పాలెం గ్రామ పరిధిలో గత నెల 29న ఇవి లభ్యం కాగా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గ్రామానికి చెందిన మానుకొండ తేజస్వికి చెందిన ఆయిల్‌పాం తోటలో పైపులైను కోసం తవ్వుతుండగా చిన్న మట్టిపిడత దొరికింది. అందులో 18 బంగారు నాణేలు ఉన్నాయి. దీంతో ఆమె భర్త సత్యనారాయణ వెంటనే తహసీల్దారుకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న తహసీల్దారు మట్టిపిడతను పరిశీలించారు. అందులోని ఒక్కో నాణెం 8 గ్రాములకు పైనే ఉన్నట్టు నిర్ధారించారు. ఈ నాణేలను రెండు శతాబ్దాల నాటివిగా భావిస్తున్నారు.