Delhi Liquor Scam: తప్పు చేయకుంటే భయమెందుకు?: విజయశాంతి
- ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితకు నోటీసులపై స్పందించిన బీజేపీ లీడర్
- స్కామ్ లో కవిత పాత్ర ఉందా.. లేదా.. అనేది విచారణలో తేలుతుందని వెల్లడి
- ఇప్పటి వరకు జరిగింది తక్కువే.. ఇంకా బయటకు రావాల్సింది చాలా ఉందని వ్యాఖ్య
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర ఉందా.. లేదా.. అనేది విచారణ సంస్థలు చెబుతాయని బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవితకు నోటీసుల జారీపై విజయశాంతి శనివారం స్పందించారు. బీజేపీకి ఎవరినీ టార్గెట్ చేయాల్సిన అవసరం లేదని అన్నారు. చేసిన పాపాలు పండుతున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. తప్పేమీ చేయకుంటే విచారణకు భయపడాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఈడీ, సీబీఐ చేసింది తక్కువేనని, ఇంకా బయటకు రావాల్సింది చాలా ఉందని విజయశాంతి చెప్పారు.
ఎన్నికలను ఎదుర్కోవడానికి కేసీఆర్ అనుసరించబోయే వ్యూహంపై తాము త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడిస్తానని విజయశాంతి చెప్పారు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్ లో ఎమ్మెల్సీ కవిత పేరును చేర్చడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. కవితతో పాటు ఆంధ్రప్రదేశ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరును కూడా ఈడీ తన రిపోర్టులో చేర్చింది. ఈ కేసులో సీబీఐ నోటీసులు అందుకున్న ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ.. లిక్కర్ స్కామ్ తో తనకు సంబంధంలేదని, ఏ విచారణకైనా తాను సిద్ధమేనని పేర్కొన్నారు.