Vijayasai Reddy: తెలంగాణలో అమరరాజా భారీ పెట్టుబడులు టీడీపీ నేతల అవకాశవాదానికి నిదర్శనం: విజయసాయిరెడ్డి
- తెలంగాణలో అమరరాజా పరిశ్రమ
- టీడీపీ, వైసీపీ మధ్య పరస్పర విమర్శలు
- చంద్రబాబుపై విజయసాయి ధ్వజం
- సొంత ఎంపీతో ఏపీలో పెట్టుబడి పెట్టించలేకపోయారని విమర్శలు
తెలంగాణలో లిథియం అయాన్ గిగా ఈవీ బ్యాటరీ తయారీ యూనిట్ స్థాపనకు అమరరాజా గ్రూప్ భారీ పెట్టుబడులు పెడుతోంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం, అమరరాజా గ్రూప్ మధ్య ఒప్పందం కుదిరింది. అయితే, ఏపీలో వైసీపీ ప్రభుత్వ వైఖరి కారణంగానే అమరరాజా తదితర పరిశ్రమలు తరలివెళుతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీకి చెందిన ఇతర నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
దీనిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పందించారు. తన పార్టీకే చెందిన ఎంపీతో సొంత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించలేని చంద్రబాబు, రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు రావాలని ఎలా మాట్లాడగలరని నిలదీశారు. తెలంగాణలో అమరరాజా బ్యాటరీస్ పరిశ్రమ రూ.9,500 కోట్ల భారీ పెట్టుబడి పెడుతుండడం టీడీపీ నేతల అవకాశవాదానికి నిదర్శనం అని విజయసాయి విమర్శించారు.