Revanth Reddy: కవితకు సీబీఐ నోటీసులపై మాకు అనుమానాలు ఉన్నాయి: రేవంత్ రెడ్డి
- ఉస్మానియాలో శ్రీకాంతాచారి వర్ధంతి కార్యక్రమానికి హాజరైన రేవంత్ రెడ్డి
- ఢిల్లీ లిక్కర్ స్కాంపై స్పందన
- కవితను ఇంట్లోనే విచారణ చేస్తామన్న సీబీఐ
- ఆమెకు మాత్రమే మినహాయింపు ఎందుకున్న రేవంత్
ఢిల్లీ లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసుల జారీ చేయడం తెలిసిందే. మీ నివాసంలోనే విచారణ చేసేందుకు సిద్ధం... మీకు ఎక్కడ సౌకర్యంగా ఉంటే అక్కడ విచారణ చేస్తాం అని సీబీఐ ఆ నోటీసుల్లో పేర్కొంది. దీనిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు.
ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులపై తమకు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. అందరినీ ఢిల్లీకి పిలిపించి విచారణ చేస్తున్నప్పుడు కవితకు మాత్రం మినహాయింపు ఎందుకు? కవితను ఇంట్లోనే విచారణ చేస్తాం అనడంలో అంతర్యం ఏమిటి? అని ప్రశ్నించారు. అసలు విషయం ఏంటో ఇక్కడే తెలుస్తోందని అన్నారు.
తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ లు బెంగాల్ ఫార్ములాను అమలు చేస్తున్నాయని రేవంత్ రెడ్డి విమర్శించారు. లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోరు ఓ వీధి నాటకాన్ని తలపిస్తోందని అభిప్రాయపడ్డారు. కుమ్మక్కు రాజకీయాలు అంటే ఇవేనని, వీటిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని స్పష్టం చేశారు.
తెలంగాణ ఉద్యమ అమరవీరుడు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమానికి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగానే పై వ్యాఖ్యలు చేశారు.