Lucky Lakshman: డిసెంబర్ 30న రిలీజ్ అవుతున్న ‘లక్కీ లక్ష్మణ్’... ఆకట్టుకుంటున్న టీజర్
- బిగ్ బాస్ ఫేమ్ సొహైల్ హీరోగా 'లక్కీ లక్ష్మణ్'
- హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో టీజర్ రిలీజ్
- సినిమా సక్సెస్ పై నిర్మాత హరిత గోగినేని ధీమా
- తమ చిత్రంలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయన్న సోహైల్
బిగ్ బాస్ ఫేమ్ సయ్యద్ సోహైల్, మోక్ష హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘లక్కీ లక్ష్మణ్’. దత్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై ఏఆర్ అభి దర్శకత్వంలో హరిత గోగినేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా నేడు చిత్ర యూనిట్ హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో టీజర్‌ను విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో హీరో సోహైల్, నిర్మాత హరిత గోగినేని, దర్శకుడు అభి, బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్, అఖిల్ సార్థక్, సన్నీ తదితరులు పాల్గొన్నారు. టిప్స్ మ్యూజిక్ ద్వారా ఆడియో రిలీజ్ అవుతుంది.
నిర్మాత హరిత గోగినేని మాట్లాడుతూ ‘‘సినిమా అనేది చిన్న బిడ్డతో సమానం. సినిమా కోసం ఏం చేయాలో అవన్నీ చేసేశాం. ఇక ఆడియెన్స్‌దే బాధ్యత. మా అందరినీ ప్రేక్షకులు ఆదరిస్తారని భావిస్తున్నాను. కలెక్షన్స్ కంటే సినిమా బావుందని అంటే చాలు. అందరూ థియేటర్స్‌లోనే సినిమా చూడాలి" అని కోరారు.
హీరో సోహైల్ మాట్లాడుతూ ‘‘ఈరోజు నేను హీరోగా చేసిన లక్కీ లక్ష్మణ్ సినిమా టీజర్‌కు ఆడియెన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే మాటలు రావటం లేదు. అభిమానులే నాకు ధైర్యం. సక్సెస్ ఉన్నా, లేకపోయినా మనల్ని ఆదరించేది మనం ఇష్టపడేవాళ్లు, ఫ్యాన్స్, ఫ్రెండ్స్. లైఫ్‌లో 12-13 ఏళ్లు చాలా కష్టపడ్డాను. బెక్కం వేణుగోపాల్‌గారు నాకు సపోర్ట్ చేసి అవకాశం ఇచ్చారు. మా నిర్మాత హరిత గోగినేని గట్స్ ఉన్న ప్రొడ్యూసర్. అభిగారు అన్నీ ఎలిమెంట్స్‌ను చక్కగా మిక్స్ చేసి ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు’’ అని అన్నారు.
దర్శకుడు ఏఆర్ అభి మాట్లాడుతూ ‘‘సినిమా మేకింగ్ సమయంలో మంచి ప్రొడక్ట్ కోసం, నాణ్యత కోసం అందరం గొడవలు పడ్డాం. ఫైనల్‌గా సినిమాను సిద్ధం చేశాం. సినిమా టీజర్ అందరికీ నచ్చుతుంది. ట్రైలర్, రెండు పాటలు రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నాం. సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు ఓ స్మైల్‌తో బయటకు వస్తారు. అన్నీ ఎమోషన్స్ ఉంటాయి. మా నిర్మాత హరిత గోగినేనిగారికి థాంక్స్. సోహైల్ సూపర్బ్‌గా యాక్ట్ చేశాడు’’ అని వివరించారు.
ఈ చిత్రంలో సయ్యద్ సోహైల్, మోక్ష, దేవీ ప్రసాద్, రాజా రవీంద్ర, సమీర్, కాదంబరి కిరణ్, షాని తదితరులు నటించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. సీనియర్ గీత రచయిత భాస్కరభట్ల పాటలకు సాహిత్యం అందించారు.