South Central Railway: వచ్చేస్తున్న ‘వందేభారత్’.. సికింద్రాబాద్-విజయవాడ మధ్య పరుగులు!
- దక్షిణ మధ్య రైల్వేకు ఓ వందేభారత్ రైలును కేటాయించిన రైల్వే
- బెర్త్‌లతో కూడిన రైలు అందుబాటులోకి వచ్చాక విశాఖ వరకు పొడిగింపు
- ఈ నెలలోనే ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం!
దేశవ్యాప్తంగా పలు రూట్లలో వందేభారత్ రైళ్లను ప్రవేశపెడుతున్న ఇండియన్ రైల్వే.. దక్షిణ మధ్య రైల్వేకు కూడా ఓ రైలును కేటాయించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ నిర్ధారించారు. ఇప్పటికే ఐదు వందేభారత్ రైళ్లు పట్టాలు ఎక్కగా ఇది ఆరోది. ఈ రైలు గరిష్ఠ వేగం 180 కిలోమీటర్లు. రెండు నిమిషాల్లోనే 160 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ రైలులో సీట్లు మాత్రమే ఉంటాయి, బెర్తులు ఉండవు. కాబట్టి తొలుత సికింద్రాబాద్-విజయవాడ మధ్య నడపాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. మున్ముందు బెర్తులతో కూడిన వందేభారత్ రైళ్లు రానున్నాయి. అప్పుడు విశాఖ వరకు పొడిగించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. సికింద్రాబాద్-విజయవాడ మార్గంలో ఈ నెలలోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా రైలును ప్రారంభించేందుకు దక్షిణమధ్య రైల్వే సన్నాహాలు చేస్తోంది.
కాగా, ఈ రైలు ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్లేందుకు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి కాజీపేట మీదుగా కాగా, రెండోది నల్గొండ మీదుగా. కాజీపేట మార్గంలో ట్రాక్ గరిష్ఠ వేగం 130 కిలోమీటర్లు కాగా, నల్గొండ మార్గంలో ఇది 110 కిలోమీటర్లుగా ఉంది. దీంతో వందేభారత్ రైలు కోసం ట్రాక్ సామర్థ్యాన్ని 180 కిలోమీటర్లకు పెంచాల్సి ఉంటుంది. త్వరలోనే ట్రాక్ అప్‌గ్రేడ్, సిగ్నలింగ్, ఇతర పనులు చేపట్టే అవకాశం ఉంది.