fifa: అద్భుత ఆటతో ఫిఫా ప్రపంచ కప్ లో క్వార్టర్స్ చేరిన అర్జెంటీనా

Messi scores as Argentina beat Australia  to reach quarters

  • ప్రిక్వార్టర్ ఫైనల్లో 2–1తో అస్ట్రేలియాపై విజయం
  • తన 1000వ మ్యాచ్ లో గోల్ చేసిన కెప్టెన్ మెస్సీ 
  • క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్ తో పోటీ పడనున్న మెస్సీసేన

ఖతార్ లో జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ లో లియోనల్ మెస్సీ కెప్టెన్సీలోని అర్జెంటీనా క్వార్టర్ ఫైనల్ కు దూసుకెళ్లింది. టోర్నీ తొలి మ్యాచ్ లోనే చిన్న జట్టు సౌదీ అరేబియా చేతిలో అనూహ్య పరాజయం పాలైన అర్జెంటీనా ఆ తర్వాత గొప్పగా పుంజుకొని నాకౌట్ చేరుకుంది. శనివారం అర్ధరాత్రి జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా 2–1తో ఆస్ట్రేలియా విజయం సాధించి కప్పు దిశగా ముందంజ వేసింది. కెరీర్లో 1000వ మ్యాచ్ ఆడిన మెస్సీ అద్భుతమైన గోల్ తో ఈ మ్యాచ్ ను మధుర జ్ఞాపకంగా మార్చుకున్నాడు. మ్యాచ్ 35వ నిమిషంలో అర్జెంటీనాకు తొలి గోల్ అందించాడు. దాంతో, ఆ జట్టు 1–0 ఆధిక్యంతో తొలి అర్ధభాగాన్ని ముగించింది.

సెకండాఫ్ మొదలైన వెంటనే అర్జెంటీనా ఆధిక్యం డబులైంది. 57వ నిమిషంలో జులియన్ అల్వారెజ్ చేసిన గోల్ తో ఆ జట్టు 2–0తో నిలిచింది. దాంతో, ఆస్ట్రేలియాపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. 77వ నిమిషంలో ఆసీస్ ఆటగాడు క్రెయిగ్ గుడ్ విన్ కొట్టిన షాట్ ప్రత్యర్థి ఆటగాడు ఎంజో ఫెర్నాండెజ్ ముఖానికి తాకి ఆర్జెంటీనా గోల్ పోస్ట్ లో పడటంతో ఆ జట్టు సెల్ఫ్ గోల్ చేసుకుంది. దాంతో, 1–2తో ఆస్ట్రేలియా పుంజుకునే ప్రయత్నం చేసినా.. మరో గోల్ చేసే అవకాశం ఇవ్వని మెస్సీసేన టోర్నీలో ముందుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్ తో అర్జెంటీనా పోటీ పడనుంది. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్ 3–1తో అమెరికాను ఓడించింది.

  • Loading...

More Telugu News