Droupadi Murmu: గన్నవరం నుంచి విశాఖ బయల్దేరిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- ఏపీ పర్యటనకు విచ్చేసిన రాష్ట్రపతి
- పోరంకిలో ఘన సన్మానం
- విందు ఏర్పాటు చేసిన గవర్నర్
- విశాఖలో నేడు నేవీ డే వేడుకలు
- హాజరుకానున్న ద్రౌపది ముర్ము
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏపీ పర్యటనలో భాగంగా పోరంకిలో ఘనంగా సన్మానం అందుకున్నారు. రాష్ట్రపతి గౌరవార్థం రాజ్ భవన్ లో గవర్నర్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం ద్రౌపది ముర్ము గన్నవరం నుంచి విశాఖపట్నం బయల్దేరారు. సీఎం జగన్, ఉన్నతాధికారులు రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు పలికారు. కాగా, రాష్ట్రపతి వెంట గవర్నర్, కిషన్ రెడ్డి కూడా విశాఖ వెళ్లనున్నారు. రాష్ట్రపతికి విశాఖలో ఏపీ ప్రభుత్వం తరఫున మంత్రి గుడివాడ అమర్నాథ్ స్వాగతం పలకనున్నారు.
విశాఖ పర్యటనలో భాగంగా ద్రౌపది ముర్ము సాయంత్రం 4.20 గంటలకు ఆర్కే బీచ్ కు చేరుకోనున్నారు. సాయంత్రం 4.30 నుంచి నావికాదళ దినోత్సవ విన్యాసాలు తిలకించనున్నారు. రాష్ట్రపతి కోసం ఆర్కే బీచ్ లో ప్రత్యేక వేదికను సిద్ధం చేశారు.