Rope Way: వారణాసిలో రూ.815 కోట్లతో భారీ రోప్ వే ప్రాజెక్టు... విశ్వ సముద్ర ఇంజినీరింగ్ సంస్థకు బాధ్యతలు

Vishwa Samudra Engineering will built urban rope way in Varanasi first of its kind in India

  • దేశంలోనే మొట్టమొదటి అర్బన్ రోప్ వే
  • తొలిసారిగా వారణాసిలో ఏర్పాటు
  • అత్యధిక బిడ్డింగ్ వేసిన విశ్వ సముద్ర ఇంజినీరింగ్ 
  • 2023 మేలో పనులు ప్రారంభం
  • 2025 నాటికి ప్రాజెక్టు పూర్తి

ప్రముఖ ఆధ్యాత్మిక నగరం వారణాసిలో భారీ రోప్ వే వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. సాధారణంగా పర్వత ప్రాంతాల్లో రోప్ వే వ్యవస్థలు కనిపిస్తుంటాయి. అయితే వారణాసి నగరంలోనూ ఈ రోప్ వేను ఏర్పాటు చేస్తుండడం విశేషం. 

ఈ అర్బన్ రోప్ వే వ్యవస్థ అంచనా వ్యయం రూ.815 కోట్లు కాగా, కేంద్ర ప్రభుత్వం విశ్వ సముద్ర ఇంజినీరింగ్ సంస్థకు ఈ ప్రాజెక్టు బాధ్యతలు అప్పగించింది. దేశంలో నగర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న తొలి రోప్ వే ఇదే. 2023 మే నెల నుంచి పనులు ప్రారంభం కానున్నాయి. 2025 మే నాటికి ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని అంచనా. 

దీని ద్వారా కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ నుంచి గోడోవాలియా చౌక్ మధ్య ప్రయాణ దూరం గణనీయంగా తగ్గనుంది. ఎంతో ఇరుకైన రోడ్డు మార్గం కలిగి ఉన్న ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణానికి గంటకు పైగా సమయం పడుతుంది. రోప్ వే ద్వారా కేవలం 17 నిమిషాల్లో గమ్యస్థానం చేరుకోవచ్చు. 

కాగా ఈ ప్రాజెక్టును నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ఏఐ) అనుబంధ సంస్థ నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్ మెంట్ లిమిటెడ్ (ఎన్ హెచ్ఎల్ఎంఎల్)... విశ్వ సముద్ర ఇంజినీరింగ్ సంస్థకు అప్పగించింది. విశ్వ సముద్ర ఇంజినీరింగ్ సంస్థ రోప్ వేల నిర్మాణంలో పేరెన్నికగన్నది. రోప్ వే నిర్మాణాలకు సంబంధించి అత్యాధునిక టెక్నాలజీ, యంత్ర సామగ్రి ఈ సంస్థ సొంతం. స్విట్జర్లాండ్ కు చెందిన బార్తోలెట్ మెషినబావ్ ఏజీ సంస్థ... విశ్వ సముద్ర ఇంజినీరింగ్ కు టెక్నాలజీ పరంగా సహాయ సహకారాలు అందిస్తోంది. 

ఈ ప్రాజెక్టు కోసం బిడ్డింగ్ అంచనా వ్యయం కంటే విశ్వ సముద్ర 17 శాతం అధికంగా కోట్ చేసింది. మొత్తమ్మీద రూ.815.6 కోట్లతో ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను చేజిక్కించుకుంది. వారణాసిలో అర్బన్ రోప్ వే నిర్మించాక విశ్వ సముద్ర ఇంజినీరింగ్ సంస్థ 15 ఏళ్ల పాటు దాని నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. 

ఈ రోప్ వే ప్రాజెక్టును హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హెచ్ఏఎమ్) విధానంలో చేపట్టనున్నారు. ప్రాజెక్టు వ్యయంలో 60 శాతం చెల్లింపులను నిర్మాణ సమయంలో నిర్మాణ మద్దతు కింద చెల్లిస్తారు. మిగతా 40 శాతం చెల్లింపులను రోప్ వే నిర్మాణం పూర్తయ్యాక నిర్వహణ సమయంలో చెల్లించడం జరుగుతుంది. 

రోప్ వే వ్యవస్థ తీరుతెన్నులు పరిశీలిస్తే... ఈ ప్రాజెక్టులో భాగంగా 5 స్టేషన్లు నిర్మిస్తారు. గోడోవాలియా చౌక్, గిరిజా ఘర్, రథ్ యాత్ర, విద్యా పీఠ్ (భారత్ మాతా), వారణాసి కంటోన్మెంట్ ప్రాంతాల్లో ఈ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. అయితే గిరిజా ఘర్ లో కేవలం టెక్నికల్ స్టేషన్ ను మాత్రమే నిర్మిస్తున్నారు. ఇక్కడి నుంచి ప్రయాణికులు రోప్ వేలో ఎక్కడం, దిగడం అనుమతించరు. 

ఈ భారీ అర్బన్ రోప్ వే ప్రాజెక్టు కోసం విశ్వ సముద్ర ఇంజినీరింగ్ సంస్థ మొత్తం 30 టవర్లు నిర్మించనుంది. ఆయా ప్రాంతాలను బట్టి ఒక్కో టవర్ 10 మీటర్ల నుంచి 55 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం రోప్ వే స్టేషన్లు, టవర్ల నిర్మాణం కోసం భూ సేకరణ ప్రారంభించింది. 

గంటకు 3 వేల మందిని తరలించేలా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తున్నారు. ఈ రోప్ వే ప్రాజెక్టుల్లో ప్రయాణికులను మోసుకెళ్లేందుకు 153 గండోలా క్యాబిన్లు వినియోగించనున్నారు. ఒక్కో గండోలాలో 10 మంది ప్రయాణికులు ఎక్కే వీలుంటుంది.

  • Loading...

More Telugu News