Team India: గెలవాల్సిన మ్యాచ్ లో ఓడిన భారత్... ఒక్క వికెట్ తేడాతో నెగ్గిన బంగ్లాదేశ్
- ఉత్కంఠపోరులో నెగ్గిన బంగ్లాదేశ్
- చేజేతులా ఓడిన భారత్
- మొదట బ్యాటింగ్ చేసిన భారత్
- 41.2 ఓవర్లలో 186 ఆలౌట్
- ఓ దశలో 136 పరుగులకే 9 వికెట్లు కోల్పోయిన బంగ్లా
- చివరి వికెట్ తీయలేకపోయిన భారత్
బంగ్లాదేశ్ తో నేడు జరిగిన తొలి వన్డేలో భారత్ కు అనూహ్య పరాజయం ఎదురైంది. ఓ దశలో విజయం నల్లేరుపై నడకే అనిపించినా, బంగ్లాదేశ్ బ్యాటర్లు ఇచ్చిన క్యాచ్ లు వదిలిన టీమిండియా అందుకు మూల్యం చెల్లించుకుంది. ఈ మ్యాచ్ లో ఒక్క వికెట్ తేడాతో బంగ్లాదేశ్ జట్టును విజయం వరించింది. భారత్ నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 9 వికెట్లు కోల్పోయి 46 ఓవర్లలో ఛేదించింది. బౌలర్ మెహిదీ హసన్ (38 నాటౌట్) బంగ్లాదేశ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. కెప్టెన్ లిటన్ దాస్ 41, షకీబల్ హసన్ 29 పరుగులు చేశారు.
ఛేజింగ్ లో 136 పరుగులకే 9 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్... ఆ తర్వాత టీమిండియా ఫీల్డర్ల దయతో గెలుపు తీరాలకు చేరింది. బంగ్లాదేశ్ చివరి ఒక్క వికెట్ ను తీయడానికి టీమిండియా బౌలర్లు విశ్వప్రయత్నాలు చేసినా సాధ్యంకాలేదు.
మెహిదీ హసన్, ముస్తాఫిజూర్ రెహ్మాన్ (10 నాటౌట్) చివరి వికెట్ కు అజేయంగా 51 పరుగులు జోడించి భారత్ గెలుపు అవకాశాలకు గండికొట్టారు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 3, కుల్దీప్ సేన్ 2, వాషింగ్టన్ సుందర్ 2, దీపక్ చహర్ 1, శార్దూల్ ఠాకూర్ 1 వికెట్ తీశారు.
ఈ విజయంతో ఆతిథ్య బంగ్లాదేశ్ జట్టు మూడు వన్డేల సిరీస్ లో 1-0తో ముందంజ వేసింది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే ఈ నెల 7న జరగనుంది.