Nara Lokesh: జగన్ రెడ్డీ... జనం నిన్ను ఎందుకు నమ్మాలయ్యా?: నారా లోకేశ్
- అవుట్ సోర్సింగ్ ఉద్యోగులపై వేటు అంటూ పత్రికా కథనం
- పదేళ్ల లోపు సర్వీసు ఉంటే ఇంటికే అంటూ వార్త
- తీవ్రంగా స్పందించిన నారా లోకేశ్
"అవుట్ సోర్సింగ్ ఉద్యోగులపై వేటు మొదలైంది... పదేళ్ల లోపు సర్వీసు ఉంటే ఇంటికే... ప్రభుత్వ రహస్య ఆదేశాలు..." అంటూ ఓ పత్రికలో వచ్చిన కథనంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు.
తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తారని, సమాన పనికి సమాన వేతనం ఇస్తారని ఎదురుచూస్తున్న రెండున్నర లక్షలకు మందికి పైగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఉపాధిపై జగన్ రెడ్డి వేటు వేస్తున్నారని మండిపడ్డారు. పదేళ్లలోపు సర్వీసు ఉన్న వారందరినీ ఇంటికి సాగనంపుతున్న జగన్ రెడ్డీ జనం నిన్ను ఎందుకు నమ్మాలయ్యా? అని ప్రశ్నించారు.
"ప్రతీ ఏటా జనవరి 1నే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని హామీ ఇచ్చి నిరుద్యోగుల ఓట్లతో గద్దెనెక్కిన జగన్ రెడ్డి ఏళ్ళు గడుస్తున్నా ఒక్క జాబ్ క్యాలెండరూ ఇవ్వలేదు. వారంలో రద్దు చేస్తానన్న సీపీఎస్ 150 వారాలైనా రద్దు చేయనట్టే అవుట్ సోర్సింగ్ వాళ్లకి ఇచ్చిన ఉద్యోగ భద్రత హామీ కూడా గాలికి ఎగిరిపోయింది" అంటూ లోకేశ్ విమర్శనాస్త్రాలు సంధించారు.