Andhra Pradesh: ఏపీలోని 4 జిల్లాల్లో మూడు రోజులపాటు భారీ వర్షాలు

Amaravati Meteorological Department predicts rain fir next three days amid surface circulation

  • బంగాళా ఖాతంలో అల్పపీడనం.. రెండు రోజుల్లో తుపాన్ గా మారే చాన్స్
  • ఈ నెల 7, 8, 9 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో మోస్తరు వర్షాలు
  • నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాలకు వర్ష సూచన

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో వచ్చే రెండు మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా రాయలసీమను వర్షాలు ముంచెత్తనున్నట్లు తెలిపారు. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. మరోవైపు, తూర్పుగాలుల ప్రభావంతో ఆదివారం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు పడతాయని, ఉత్తర కోస్తాలో వాతావరణం పొడిగా వుంటుందని వాతావరణ శాఖ పేర్కొంది.

గల్ఫ్‌ ఆఫ్‌ థాయ్‌లాండ్‌ నుంచి హిందూ మహా సముద్రంలోకి ప్రవేశించిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం పశ్చిమ వాయవ్యంగా పయనించి ఈ నెల 7 నాటికి వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది.

అల్పపీడనం ఈ నెల 6వ తేదీకి వాయుగుండంగా, ఏడో తేదీకి తుపాన్‌గా మారుతుందని ఇస్రో వాతావరణ నిపుణుడు తెలిపారు. ఈ నెల 9వ తేదీ రాత్రి లేదా 10వ తేదీ ఉదయం ఉత్తర తమిళనాడులో తీరం దాటుతుందని అంచనా వేశారు. తుపాన్ ప్రభావంతో దక్షిణ కోస్తాలో 7వ తేదీ రాత్రి నుంచి వర్షాలు కురుస్తాయని చెప్పారు. 

ఈ నెల 8, 9 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో పలుచోట్ల భారీ వర్షాలు, ఉత్తరకోస్తాలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని దక్షిణ కోస్తాలోని మత్స్యకారులకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News