Amber Heard: మాజీ భర్తకు వ్యతిరేకంగా వర్జీనియా కోర్టును ఆశ్రయించిన హాలీవుడ్ నటి అంబర్ హెర్డ్
- 10 మిలియన్ డాలర్లు చెల్లించాలనడం తన హక్కులను తోసిపుచ్చడమేనన్న హెర్డ్
- ట్రయల్ కోర్టు ఆదేశాలను సవాలు చేసిన హాలీవుడ్ నటి
- 2 మిలియన్ డాలర్లు చెల్లించాలన్న ఆదేశాలపై జానీడెప్ సవాలు
ప్రముఖ హాలీవుడ్ నటి అంబర్ హెర్డ్ తన మాజీ భర్త జానీడెప్ కు వ్యతిరేకంగా వర్జీనియా కోర్టును ఆశ్రయించింది. ఇటీవలే ఆమె పరువు నష్టం కేసులో ట్రయల్ కోర్టులో ఓడిపోవడం తెలిసిందే. 10 మిలియన్ డాలర్లు (రూ.82 కోట్లు) పరువు నష్టం కింద జానీడెప్ కు చెల్లించాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే, అంబర్ హెర్డ్ దాఖలు చేసిన కేసులో ఆమెకు 2 మిలియన్ డాలర్లు చెల్లించాలని జానీడెప్ ను కోర్టు ఆదేశించడం తెలిసిందే.
2 మిలియన్ డాలర్లు చెల్లించాలన్న కోర్టు ఆదేశాలను జానీడెప్ సవాలు చేసిన రోజుల వ్యవధిలోనే అంబర్ హెర్డ్ సైతం కోర్టుకెక్కడం గమనార్హం. 10 మిలియన్ డాలర్లు చెల్లించాలని ఆదేశించడం.. ఓ శక్తిమంతమైన వ్యక్తి వేధింపులకు వ్యతిరేకంగా, చట్టబద్ధమైన హక్కులను వినియోగించుకోకుండా నిరుత్సాహపరిచినట్టుగా ఆమె అప్పీల్ లో పేర్కొంది. జానీడెప్ అంబర్ హెర్డ్ ను ఎన్నో సందర్భాల్లో వేధింపులకు గురిచేసినట్టు ట్రయల్ కోర్ట్ పేర్కొందని, కనుక ఆ అంశాల విచారణలోకి వెళ్లొద్దని ఆమె కోరింది.