Sajjala Ramakrishna Reddy: అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు ఆదేశాలపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు: సజ్జల
- అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపుపై కథనాలు
- ఎవరినీ తొలగించడంలేదని సజ్జల స్పష్టీకరణ
- ఆదేశాలు వెనక్కి తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారని వెల్లడి
ఏపీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధమైందంటూ పత్రికల్లో కథనాలు రాగా, వైసీపీ ప్రభుత్వంపై విపక్ష నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల అంశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం జరుగుతుండడంతో, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రంగంలోకి దిగారు.
ఏపీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. అందులో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఏపీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఎవరినీ తొలగించబోవడంలేదని అన్నారు.
పంచాయతీరాజ్ విభాగంలో కొందరు ఉద్యోగుల తొలగింపునకు అధికారులు ఆదేశాలు ఇవ్వగా, సీఎం జగన్ మండిపడ్డారని సజ్జల వెల్లడించారు. ఆ ఆదేశాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారని వివరణ ఇచ్చారు. పంచాయతీ రాజ్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు వ్యవహారంపై విచారణ జరుగుతుందని వెల్లడించారు.