Lalu Prasad Yadav: లాలూకు కిడ్నీ మార్పిడి విజయవంతం
- కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న లాలూ
- సింగపూర్ ఆసుపత్రికి తరలింపు
- కిడ్నీ దానం చేసిన లాలు కుమార్తె రోహిణి
- నేడు శస్త్రచికిత్స నిర్వహించిన సింగపూర్ వైద్యులు
- లాలూతో పాటు రోహిణి కూడా ఆరోగ్యంగా ఉన్నట్టు తేజస్వి వెల్లడి
గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కు కిడ్నీ మార్పిడి విజయవంతమైంది. సింగపూర్ లోని ఓ ఆసుపత్రిలో ఆయనకు నేడు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించారు. లాలూ కుమార్తె రోహిణి తండ్రికి కిడ్నీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
చికిత్స అనంతరం లాలూ ఆరోగ్యంగా ఉన్నారని ఆయన కుమారుడు, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ వెల్లడించారు. కిడ్నీ ఇచ్చిన తన సోదరి రోహిణి కూడా ఆరోగ్యంగానే ఉన్నట్టు తెలిపారు. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స అనంతరం తన తండ్రిని ఆపరేషన్ థియేటర్ నుంచి ఐసీయూకి మార్చారని తేజస్వి పేర్కొన్నారు.
కాగా, లాలూ కుమార్తె రోహిణి సింగపూర్ కు చెందిన ఓ ఐటీ నిపుణుడిని పెళ్లాడి అక్కడే స్థిరపడ్డారు. తండ్రి కోసం తన కిడ్నీ ఇచ్చి ఆయనపై తన ప్రేమను చాటుకున్నారు. తన తండ్రి ఎందరికో ఆదర్శప్రాయుడని, ఆయన కోసం తాను చేస్తున్నది చాలా చిన్న త్యాగమని ఇటీవల రోహిణి పేర్కొన్నారు.
లాలూకు కిడ్నీ మార్పిడి నేపథ్యంలో బీహార్ వ్యాప్తంగా ఆర్జేడీ శ్రేణులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాయి.