Supreme Court: బలవంతపు మతమార్పిళ్లు రాజ్యాంగ విరుద్ధం: సుప్రీంకోర్టు
- బెదిరింపులు, ప్రలోభాలకు గురిచేస్తున్నారన్న న్యాయవాది అశ్వనీకుమార్
- పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు
- వారం గడువు కోరిన కేంద్రం
- తదుపరి విచారణ ఈ నెల 12కి వాయిదా
దేశంలో బలవంతపు మత మార్పిళ్ల అంశం చాలా తీవ్రమైన విషయమని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. బలవంతపు మతమార్పిళ్లు రాజ్యాంగానికి విరుద్ధం అని స్పష్టం చేసింది. న్యాయవాది అశ్వనీకుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.
బెదిరింపులు, భయాందోళనలకు గురిచేయడం, కానుకల పేరిట ప్రలోభాలకు గురిచేయడం, ఆర్థిక లబ్ది కలిగించడం వంటి కారణాలతో అక్రమ మతమార్పిళ్లకు పాల్పడుతున్నారని, కఠినచర్యలతో వాటికి అడ్డుకట్ట వేసేలా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని న్యాయవాది అశ్వనీకుమార్ సుప్రీంకోర్టును కోరారు.
ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా కేంద్రం తన వాదనలు వినిపించింది. అవాంఛనీయ మార్గాల్లో మత మార్పిళ్లకు పాల్పడుతున్న ఘటనపై రాష్ట్రాల నుంచి సమాచారం సేకరిస్తున్నామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. దీనిపై సమగ్ర సమాచారం అందించడానికి మరికాస్త సమయం కావాలని కోరారు. ఓ వారం గడువిస్తే పూర్తి సమాచారం సేకరిస్తామని మెహతా వెల్లడించారు.
దీనిపై సుప్రీం ధర్మాసనం స్పందిస్తూ, "సాంకేతిక పరమైన అంశాల లోతుల్లోకి వెళ్లాల్సిన పనిలేదు. దీనికి ఒక పరిష్కారం కనుగొనాలన్నదే మా ఉద్దేశం... మేం ఇక్కడున్నది అందుకే. ఎవరైనా ప్రజలకు దాతృత్వ సేవలు అందిస్తుంటే దాన్ని స్వాగతించాలి. కానీ దాని వెనుక ఏదైనా ఉద్దేశం అంటే దాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. బలవంతపు మతమార్పిడి అనేది కొట్టిపారేయలేని అంశం. ఏదేమైనా ఇది రాజ్యాంగ వ్యతిరేకం కాబట్టి చాలా తీవ్రమైన అంశంగా భావిస్తున్నాం. భారత్ లో నివసించే ప్రతి ఒక్కరూ దేశ సంస్కృతికి అనుగుణంగా నడుచుకోవాల్సిందే" అంటూ జస్టిస్ ఎమ్మార్ షా, జస్టిస్ సీటీ రవిశంకర్ ధర్మాసనం పేర్కొంది. అనంతరం తదుపరి విచారణను డిసెంబరు 12కి వాయిదా వేసింది.