England: ఇలాంటి ఫీల్డింగ్ ఎప్పుడైనా చూశారా?.. పాక్‌ను ఇంగ్లండ్ ఎలా చుట్టుముట్టిందో చూడండి!
- ఇంగ్లండ్-పాక్ మ్యాచ్‌లో కనుల విందైన దృశ్యం
- మొత్తం 11 మందినీ ఒకే చోట మోహరించిన ఇంగ్లండ్ కెప్టెన్
- పాక్ బ్యాటర్లను ఉక్కిరి బిక్కిరి చేసిన ఫొటో వైరల్
రావల్పిండిలో పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ 74 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విజయం సాధించి మూడు టెస్టుల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. పాకిస్థాన్ తన తొలి ఇన్నింగ్స్‌లో 579 పరుగులు చేసినప్పటికీ, ఇంగ్లండ్ తన రెండో ఇన్నింగ్స్‌ను 264/7 వద్ద డిక్లేర్ చేసి ప్రత్యర్థి ఎదుట 343 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచి సాహసమే చేసింది. లక్ష్య ఛేదనలో పాక్ ఒక దశలో 176/3తో మెరుగ్గా కనిపించినప్పటికీ ఆ తర్వాత ఇంగ్లిష్ బౌలర్ల ముందు తలొగ్గాల్సి వచ్చింది. తర్వాతి ఏడు వికెట్లను 92 పరుగులకే చేజార్చుకుని ఓటమి పాలైంది.
ఇక, అసలు విషయానికి వస్తే.. పాకిస్థాన్‌కు నిర్దేశించిన లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో ఇంగ్లండ్ బౌలర్లు రాణించారు. కెప్టెన్ తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేశారు. ఇంగ్లండ్ స్కిప్పర్ బెన్‌స్టోక్స్ ఫీల్డింగ్ విషయంలో పాకిస్థాన్‌ను ముప్పుతిప్పలు పెట్టాడు. మొత్తం 11 మందిని ఒకే చోట మోహరించి పాక్ బ్యాటర్లను బెంబేలెత్తించాడు. ఎప్పుడో 80-90లలో కనిపించిన ఈ తరహా ఫీల్డింగ్ పాక్-ఇంగ్లండ్ మ్యాచ్‌లో కనిపించడంతో టెస్టు క్రికెట్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టెస్టు క్రికెట్లోని మజా ఇదేనంటూ కామెంట్లు చేస్తున్నారు.