Himanta Biswa: తల్లి గర్భాన్ని వ్యవసాయభూమిగా చూడలేం: బద్రుద్దీన్ అజ్మల్ పై అసోం ముఖ్యమంత్రి ఆగ్రహం
- ముస్లింలు ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కనొద్దన్న హిమంత
- అప్పుడే మీ పిల్లలను ఉన్నతమైన వ్యక్తులుగా పెంచవచ్చని హితవు
- హిందూ మహిళలు ఎందరిని కనాలని చెప్పే హక్కు అజ్మల్ కు లేదని వ్యాఖ్య
హిందూ పురుషులు అక్రమ సంబంధాలు పెట్టుకుని, 40 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లి చేసుకుంటారని... అందుకే హిందూ జనాభా పెరగడం లేదని అసోం ఎంపీ ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ముస్లిం పురుషులు 21 ఏళ్లు దాటగానే పెళ్లి చేసుకుంటారని... హిందువులు కూడా ఇదే అనుసరించాలని హితవు పలికారు. సారవంతమైన భూమిలో విత్తనాలను నాటితే మంచి ఫలితాలను ఆశించవచ్చని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తల్లి గర్భాన్ని వ్యవసాయ క్షేత్రంగా చూడలేమని హిమంత అన్నారు. ఎక్కువ మంది పిల్లలను కనాలని చెప్పడం మహిళలను అవమానించడమేనని చెప్పారు. ఓ బహిరంగసభలో హిమంత మాట్లాడుతూ... ముస్లింల ఓట్లు తనకు అవసరం లేదని... కానీ అజ్మల్ చెపుతున్న మాట వినొద్దని మీకు సూచిస్తున్నానని అన్నారు. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కనొద్దని హితవు పలికారు. అప్పుడే మీ పిల్లలను మంచి క్రీడాకారులుగా, డాక్టర్లుగా, ఇంజినీర్లుగా, ఉన్నతమైన వ్యక్తులుగా పెంచవచ్చని చెప్పారు.
మహిళలు పిల్లలను కనే కర్మాగారాలు అని నమ్మించడానికి అజ్మల్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. హిందూ మహిళలు ఎంత మంది పిల్లలను కనాలి అని చెప్పే హక్కు అజ్మల్ కు లేదని అన్నారు. పిల్లలను పెంచేందుకు అజ్మల్ డబ్బు చెల్లించేందుకు సిద్ధంగా ఉంటే తాను కూడా 10 మంది పిల్లలను కంటానని చెప్పారు.