Fastest Bikes: ప్రపంచంలో 10 ఫాస్టెస్ట్ బైకులు ఇవే!
- ఈ బైకుల ధర ఎక్కువే!
- కోట్ల ధర పలికే కొన్ని బైకులు
- కుర్రకారును ఆకర్షించే రేస్ బైకులు
- స్పోర్ట్స్ బైకులకు యమ క్రేజ్
- సెకన్ల వ్యవధిలో 100 కిమీ స్పీడ్
వేగంగా దూసుకెళ్లే బైకులను కుర్రకారు అమితంగా ఇష్టపడుతుంటారు. ఏ దేశంలో అయినా ఇదే ట్రెండ్! వేగమే కాదు వీటి ఖరీదు కూడా ఎక్కువే. కొన్ని మోడళ్లయితే కోట్ల ధర పలుకుతుంటాయి. అయినప్పటికీ కొనేవాళ్లు ఉంటుండడంతో పలుదేశాల్లో వీటి అమ్మకాలు సాగుతున్నాయి. ఇక ప్రపంచంలోనే అత్యంత వేగంగా వెళ్లే టాప్-10 బైకుల వివరాలు ఇవిగో..
జపాన్ బైక్ తయారీ దిగ్గజం కవాసాకీ సాధారణ మోటార్ సైకిళ్లే కాదు రేస్ బైకుల తయారీకి కూడా పెట్టింది పేరు. వేగాన్ని ఇష్టపడేవారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన బైక్ ఇది. దీంట్లో 1,441 సీసీ ఇన్ లైన్ ఫోర్ ఇంజిన్ అమర్చారు. ఇది గరిష్ఠంగా 401 కిమీ వేగంతో దూసుకెళుతుంది. దీనికి కింగ్ ఆఫ్ ద క్వార్టర్ మైల్ అనే ముద్దు పేరుంది. భారత మార్కెట్లో దీని ధర రూ.19.7 లక్షలు.
కవాసాకి తన రేసింగ్ బైక్ ల శ్రేణిలో తీసుకువచ్చిన మరో సూపర్ బైక్ హెచ్2ఆర్. బాణంలా దూసుకెళుతుందని దీనికి పేరు. దీని టాప్ స్పీడ్ గంటకు 386 కిలోమీటర్లు. ఇది ఇంత వేగంగా వెళ్లే బైక్ అయినప్పటికీ స్ట్రీట్ లీగల్ వెర్షన్ గా గుర్తింపు పొందింది. స్ట్రీట్ లీగల్ వెర్షన్ అంటే ఇది వీధుల్లోనూ, బయట ఎక్కడైనా నడిపేందుకు అనుమతి ఉంటుంది. సాధారణంగా అత్యధిక సీసీ ఉండే బైకులను బయటి ప్రదేశాల్లో అనుమతించరు. భారత్ లో దీని ధర రూ.80 లక్షల వరకు ఉంది.
ఇది ఎలక్ట్రిక్ బైక్. అయితేనేం... గంటకు 351 కిమీ వేగంతో రివ్వున దూసుకెళుతుంది. దీంట్లో జేపీడబ్ల్యూ లిక్విడ్ కూల్డ్ 150 కిలోవాట్ మోటార్ ను డీసీ ఫాస్ట్ చార్జర్ తో కేవలం 30 నిమిషాల్లోనే చార్జింగ్ చేయొచ్చు. దీంట్లోని ఇంజిన్ 200 హార్స్ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎల్ఎస్-218 ఎలక్ట్రిక్ బైక్ ను అమెరికా కంపెనీ లైట్నింగ్ మోటార్ సైకిల్స్ తయారుచేస్తోంది. స్ట్రీట్ లీగల్ వెర్షన్ ఎలక్ట్రిక్ బైకుల్లో ఇదే ఫాస్టెస్ట్. 2014 నుంచి ఈ బైకు రోడ్లపై పరుగులు తీస్తోంది. ఈ బైక్ ధర రూ.25 లక్షల వరకు ఉంటుంది.
ఇటలీ మోటార్ సైకిల్ దిగ్గజం డుకాటి ఇంటర్నేషనల్ ఫేమస్ అని తెలిసిందే. అటు స్టయిల్, ఇటు వేగం... డుకాటి బైకుల స్పెషాలిటీ ఇదే. డుకాటి స్పోర్ట్స్ బైకుల శ్రేణిలో 2015లో 1199 పనిగేల్ ఆర్ మోడల్ ను మార్కెట్లో విడుదల చేసింది. బోర్గో పనిగేల్ అనేది ఇటలీలో ఓ పారిశ్రామిక పట్టణం. ఈ పట్టణం పేరుమీదనే తన మోడల్ కు డుకాటీ పనిగేల్ అని నామకరణం చేసింది. ఈ బైకు టైటానియం రాడ్లతో కూడిన ట్విన్ సిలిండర్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 202 హార్స్ పవర్ ను ఇస్తుంది. తద్వారా గరిష్ఠంగా గంటకు 325 కిమీ వేగం అందుకోవచ్చు. దీని ధర రూ.51.82 లక్షల వరకు ఉంది.
పేరుకు తగ్గట్టుగానే ఇది హైపర్ స్పోర్ట్స్ బైక్. కేవలం 3 సెకన్లలోనే సున్నా నుంచి 100 కిమీ స్పీడ్ అందుకుంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇది ఎలక్ట్రిక్ బైక్. సాధారణంగా పెట్రోల్ ఇంజిన్లతో నడిచే బైకుల్లో ఇంతటి పికప్ చూస్తాం. కానీ పెట్రోల్ బైకుల కంటే మిన్నగా డామన్ హైపర్ స్పోర్ట్ ప్రోలో రాపిడ్ పికప్ చూడొచ్చు. 200 హార్స్ పవర్ శక్తితో మాగ్జిమమ్ గంటకు 321 కిమీ వేగంతో దూసుకెళుతుంది. దీని ప్రారంభ ధర రూ.18 లక్షలు కాగా, దీంట్లోని హైఎండ్ వెర్షన్ ధర రూ.29 లక్షలు.
ఇటలీ ఆటోమొబైల్ దిగ్గజం డుకాటి నుంచి వెలువడిన మరో బైక్ పనిగేల్ వీ4 ఆర్. ప్రధానంగా ఇది రేసింగ్. దీని డిజైన్ చూస్తేనే ఆ విషయం తెలిసిపోతుంది. ఇందులో శక్తిమంతమైన 1,103 సీసీ వీ4 ఇంజిన్ అమర్చారు. వీ-ట్విన్ 1299 ఇంజిన్ ను మరింత అభివృద్ధి చేసి వీ4 ఇంజిన్ కు రూపకల్పన చేశారు. ఈ బైక్ లో 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ఉంటుంది. ఓ స్ట్రీట్ బైక్ కు వీ4 ఇంజిన్ అమర్చి పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడం డుకాటీ పోర్ట్ ఫోలియోలో ఈ మోడల్ తోనే ప్రారంభమైంది. దీని ధర రూ.52.20 లక్షలు. దీని టాప్ స్పీడ్ గంటకు 320 కిమీ.
ఇటలీ ద్విచక్రవాహన తయారీ దిగ్గజం పియాజ్జియో ఏప్రిలియా బ్రాండ్ పేరిట ఉత్పత్తి చేసే బైకులకు ఇది తలమానికం వంటిది. ఇందులో 217 హార్స్ పవర్ నిచ్చే శక్తిమంతమైన వీ4 ఇంజిన్ పొందుపరిచారు. ఇది గరిష్ఠంగా గంటకు 320 కిమీ వేగంతో ప్రయాణిస్తుంది. దీని ధర రూ.23.69 లక్షలు. దీంట్లో బీఎస్-6 వెర్షన్ కూడా వచ్చింది.
ఇది కూడా ఇటలీ బైకే. ఇది 998 సీసీ ఫోర్ స్ట్రోక్ 16 వాల్వ్ ఇంజిన్ సహితం. 6 స్పీడ్ కాన్ స్టాంట్ మెష్ ట్రాన్స్ మిషన్ దీని ప్రత్యేకత. దీని ఇంజిన్ 192.4 బీహెచ్ పీ శక్తిని ఉత్పత్తి చేయగలదు. ఎంవీ అగస్టా ఎఫ్4 సీసీ గరిష్ఠంగా గంటకు 314 కిమీ వేగంతో దూసుకెళుతుంది. దీంట్లో అత్యధిక భాగాలను కార్బన్ ఫైబర్ మెటీరియల్ తో తయారుచేశారు. దీని ధర రూ.30 లక్షల పైమాటే!
జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం సుజుకి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాధారణ బైకుల నుంచి రేసింగ్ బైకుల వరకు సుజుకి తనదైన ముద్ర వేస్తోంది. అనేక దేశాల్లో ఎంతో ప్రాచుర్యం పొందిన హయబూసా బైక్ ను తయారు చేసేది సుజుకినే. ఈ రేసింగ్ స్పెషల్ బైక్ గంటకు 312 టాప్ స్పీడ్ అందుకోగలదు. మిగతా బైకుల కంటే స్టయిలిష్ గా కనిపించడం హయబూసా స్పెషాలిటీ. సెలెబ్రిటీలు మెచ్చే బైక్ గా ఇది గుర్తింపు పొందింది. దీంట్లో 162 హార్స్ పవర్ నిచ్చే 1,299 సీసీ ఇంజిన్ అమర్చారు. దీని ధర రూ.16.41 లక్షలు.