Vasireddy Padma: ప్రేమను నిరాకరిస్తే చంపేస్తారా?: తపస్వి హత్యపై వాసిరెడ్డి పద్మ స్పందన

Vasireddy Padma reacts to medico murder case

  • గుంటూరు జిల్లాలో మెడికో తపస్వి హత్య
  • సర్జికల్ బ్లేడ్ తో దాడి చేసిన జ్ఞానేశ్వర్
  • గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాన్ని పరిశీలించిన పద్మ
  • వేగంగా దర్యాప్తు చేయాలని పోలీసులకు ఆదేశాలు

గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో ప్రేమోన్మాది జ్ఞానేశ్వర్ ఘాతుకానికి తపస్వి అనే మెడికో బలైన సంఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో తపస్వి మృతదేహాన్ని పరిశీలించారు. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. 

ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. గతంలో తపస్వి... జ్ఞానేశ్వర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిందని, కౌన్సిలింగ్ ఇస్తే చాలు అని పోలీసులకు చెప్పిందని వాసిరెడ్డి పద్మ వెల్లడించారు. అయితే, జ్ఞానేశ్వర్ కక్షగట్టి తపస్విని అంతమొందించడం దురదృష్టకరమని అన్నారు. తపస్వి తనకు ఎదురవుతున్న వేధింపుల పట్ల ఎప్పుడూ కుటుంబ సభ్యులకు చెప్పలేదని, తల్లిదండ్రులకు చెప్పి ఉంటే వాళ్లు ఆమెకు అండగా నిలిచేవారేమో అని వాసిరెడ్డి పద్మ విచారం వ్యక్తం చేశారు. 

సోషల్ మీడియాలో పరిచయం అయ్యేవారి స్వభావాన్ని గుర్తించలేమని, ఇలాంటి పరిచయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. ప్రేమ వ్యవహారాల్లో కక్ష సాధింపు ధోరణి విడనాడాలని హితవు పలికారు. మహిళలకు ప్రేమించే హక్కు ఉన్నప్పుడు నిరాకరించే హక్కు కూడా ఉంటుందని స్పష్టం చేశారు. 

తపస్వి హత్యోదంతంలో పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారని, ఈ కేసులో ఎవరినీ వదిలేది లేదని స్పష్టం చేశారు. ఈ కేసును త్వరితంగా దర్యాప్తు చేయాలని మహిళా కమిషన్ ఆదేశించిందని వాసిరెడ్డి పద్మ తెలిపారు.

  • Loading...

More Telugu News