Depression: బంగాళాఖాతంలో వాయుగుండం... దక్షిణ కోస్తాపై గురి

Low pressure in Bay Of Bengal intensifies into depression

  • ఐఎండీ తాజా బులెటిన్
  • చెన్నైకి తూర్పు ఆగ్నేయ దిశలో వాయుగుండం
  • ఏపీ దక్షిణ కోస్తా, తమిళనాడులపై గురి
  • ఈ నెల 8 నుంచి మూడ్రోజుల పాటు భారీ వర్షాలు

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ఈ సాయంత్రం వాయుగుండంగా మారిందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. ప్రస్తుతం ఇది చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 1,020 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని ఐఎండీ తెలిపింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ రేపు (డిసెంబరు 7) సాయంత్రానికి తుపానుగా బలపడుతుందని వివరించింది. 

కాగా, తుపానుగా మారే సమయానికి ఇది నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశిస్తుంది. డిసెంబరు 8వ తేదీ నాటికి తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్రపై ప్రభావం చూపించనుంది. ఈ తుపాను ప్రభావం తమిళనాడు, కోస్తాంధ్రపై 48 గంటల పాటు ఉంటుందని ఐఎండీ తాజా బులెటిన్ చెబుతోంది. ఈ నెల 8 నుంచి మూడ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు ఐఎండీ పేర్కొంది. 

ఏపీలో నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, చిత్తూరు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ స్పందించింది. తీర ప్రాంత జిల్లాల అధికార యంత్రాంగాలను అప్రమత్తం చేసింది. తుపానును ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని స్పష్టం చేసింది. కాగా, ఈ తుపానుకు యూఏఈ 'మాండస్' అని నామకరణం చేయడం తెలిసిందే.

  • Loading...

More Telugu News