Maruti Suzuki: భారీ సంఖ్యలో కార్లను వెనక్కి పిలిపిస్తున్న మారుతి సుజుకి... ఎందుకంటే...!
- పలు మోడళ్ల కార్లలో సీటు బెల్టు లోపం
- షోల్డర్ హైట్ అడ్జస్టర్ లోపభూయిష్టంగా ఉన్నట్టు గుర్తింపు
- 9,125 కార్ల రీకాల్
- ఉచితంగానే విడిభాగాలు అమర్చనున్న మారుతి
వాహనాల్లో సీటు బెల్టు ఎంత ముఖ్యమైనదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోడ్డు ప్రమాదాల్లో వాహనాల్లో కూర్చున్నవారు ఒక్కసారిగా ఎగిరిపడకుండా సీటు బెల్టు నిరోధిస్తుంది. తద్వారా చాలావరకు ప్రాణనష్టం జరగకుండా కాపాడుతుంది.
కాగా, కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి తాజాగా వేలాది కార్లను వెనక్కి పిలిపిస్తోంది. 9,125 కార్లను రీకాల్ చేస్తోంది. అందుకు కారణం ముందు వరుసలోని సీట్ బెల్టుల్లో లోపాలు ఉన్నట్టు గుర్తించారు. షోల్డర్ హైట్ అడ్జస్టర్ లోపభూయిష్టంగా ఉందని భావిస్తున్నారు.
ఈ లోపం వల్ల... సీటు బెల్టు పెట్టుకున్నప్పటికీ విడిపోతుండడంతో దీన్ని మారుతి సుజుకి తీవ్రంగా పరిగణిస్తోంది. దాంతో, ఆ లోపాన్ని సవరించేందుకు కార్ల రీకాల్ ప్రకటించారు. 2022 నవంబరు 2వ తేదీ నుంచి నవంబరు 28వ తేదీ మధ్య తయారైన గ్రాండ్ విటారా, బ్రెజా, సియాజ్, ఎక్స్ఎల్-6, ఎర్టిగా మోడళ్ల కార్లను వెనక్కి పిలిపిస్తున్నట్టు మారుతి సుజుకి వెల్లడించింది.
కాగా, షోరూమ్ కు పిలిపించిన వాహనాలను పరిశీలించి, అవసరమైతే ఉచితంగానే విడిభాగాలు అమర్చనున్నారు. రీకాల్ జాబితాలో ఉన్న వాహనాల యజమానులకు సమాచారం అందించనున్నారు.