fifa: ఫిఫా ప్రపంచ కప్లో చరిత్ర సృష్టించిన మొరాకో జట్టు
- తొలిసారి క్వార్టర్ ఫైనల్ చేరుకున్న చిన్న జట్టు
- ప్రిక్వార్టర్ ఫైనల్లో మాజీ విజేత స్పెయిన్ పై అద్భుత విజయం
- పెనాల్టీ షూటౌట్ లో 3–0తో గెలిచిన మొరాకో
ఫిఫా ప్రపంచ కప్ లో సంచలన ప్రదర్శనలు, ఫలితాలు వస్తూనే ఉన్నాయి. గ్రూప్ దశలో గత టోర్నీ రన్నరప్ క్రొయేషియా, బలమైన జట్టు బెల్జియంకు షాకిచ్చిన అనామక జట్టు మొరాకో మరో సంచలనం సృష్టించింది. మాజీ చాంపియన్ స్పెయిన్ ను ఓడించి ప్రపంచ కప్ లో తొలిసారి క్వార్టర్ ఫైనల్ చేరుకొని చరిత్ర సృష్టించింది. మంగళవారం రాత్రి హోరాహోరీగా సాగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో మొరాకో పెనాల్టీ షుటౌట్లో 3–0తో బలమైన స్పెయిన్ ను ఓడించింది. చివరి నిమిషం ఉత్కంఠగా సాగిన పోరులో, నిర్ణీత 90 నిమిషాలతో పాటు అదనపు సమయం (30 నిమిషాలు)లోనూ ఇరు జట్లూ ఒక్క గోల్ కూడా చేయకుండా 0–0తో నిలిచాయి.
దాంతో, విజేతను తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్ నిర్వహించారు. ఇందులో మొరాకో తరఫున అబ్దెల్లామిడ్ సబిరి, హకీమ్ జయెచ్, అక్రాఫ్ హకిమి గోల్స్ సాధించారు. స్పెయిన్ మూడు ప్రయత్నాల్లోనూ ఫెయిలవడంతో టోర్నీ నుంచి షూటౌట్ అయ్యింది. పాబ్లో కొట్టిన షాట్ గోల్ బార్ కు తగిలి పక్కకు పెళ్లిపోయింది. ఆ తర్వాత సోలెర్, బాస్కెట్స్ కొట్టిన షాట్లను అద్భుతంగా అడ్డుకున్న గోల్ కీపర్ యాసిన్ బౌనౌ మొరాకోను క్వార్టర్స్ చేర్చాడు. షూటౌట్లో తేలిపోయిన 2010 చాంపియన్ స్పెయిన్ వరుసగా మూడు ఎడిషన్లలో క్వార్టర్ ఫైనల్ చేరడంలో ఫెయిలైంది. మరో వైపు తమ దేశ చరిత్రలో మొరాకో మొదటి సారి ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్ చేరుకుంది.