jayaho bc sabha: నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 50 శాతం ఇచ్చిన నేత జగన్: ఎమ్మెల్యే పార్థసారథి
- బీసీలే తన వెన్నెముకగా జగన్ భావిస్తారన్న వైసీపీ ఎమ్మెల్యే
- మూడేళ్లలో చంద్రబాబు బీసీలకు ఇచ్చింది 18 వేల కోట్లు..
- మూడున్నరేళ్లలో జగన్ ప్రభుత్వం 1.25 లక్షల కోట్లు ఇచ్చిందని వెల్లడి
బడుగు బలహీన వర్గాలకు నామినేటెడ్ పదవులిచ్చి ప్రోత్సహించింది ముఖ్యమంత్రి జగనేనని వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి పేర్కొన్నారు. బీసీలకు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం అవకాశం కల్పించారని కొనియాడారు. గత పాలకులు తోకలు కత్తిరిస్తానని బీసీలను బెదిరింపులకు గురిచేస్తే.. జగన్ ప్రభుత్వం మాత్రం బీసీల సంక్షేమం కోసం నేరుగా వారి ఖాతాల్లోకే డబ్బులు జమ చేసిందని చెప్పారు. రాష్ట్రానికి వెన్నెముక బీసీలేనని ముఖ్యమంత్రి జగన్ బలంగా నమ్ముతున్నారని తెలిపారు. సంక్షేమ పథకం పొందడం పేదవారి హక్కుగా జగన్ సర్కారు పాలన సాగిస్తోందని తెలిపారు.
బీసీలకు జగన్ ఏంచేశారని అవాకులు చెవాకులు పేలుతున్నవారు ఈ సభకు వచ్చి, ఇక్కడున్న జనాలను చూస్తే జగన్ ఏంచేశారో వారికే అర్థమవుతుందని ఎమ్మెల్యే పార్థసారథి చెప్పారు. చట్టసభల్లో బీసీలకు ప్రాధాన్యం కల్పిస్తే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్, భారత దేశం మొత్తం బీసీలు, ఎస్టీల చేతుల్లోకి వెళ్లిపోతుందని అన్ని పార్టీలు భయపడ్డాయని చెప్పారు. ఏ పార్టీ కానీ, ఏ నేత కానీ చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కావాలని, వారికి ప్రాధాన్యం కల్పించాలని ప్రయత్నించలేదని ఆరోపించారు. వైఎస్ జగన్ మాత్రమే ధైర్యంగా బీసీ రిజర్వేషన్ బిల్లును చట్టసభల్లో ప్రవేశపెట్టారని పార్థసారథి వివరించారు.
చంద్రబాబు పాలనలో చివరి మూడేళ్ల కాలంలో బీసీలకు కేటాయించిన నిధులు కేవలం 18 వేల కోట్లు మాత్రమేనని పార్థసారథి చెప్పారు. కానీ ఈ మూడున్నరేళ్ల జగన్ పాలనలో బీసీలకు సుమారు 1.25 లక్షల కోట్లు కేటాయించామని ఎమ్మెల్యే పార్థసారథి చెప్పారు. బీసీలకు జగన్ సర్కారు ఇచ్చే ప్రాధాన్యత ఈ లెక్కలతో తెలుసుకోవచ్చని వివరించారు.