Bypoll: ఉప ఎన్నికలో విజయం దిశగా దివంగత ములాయం సింగ్ కోడలు డింపుల్
- ఎస్పీ అధినేత ములాయం మరణంతో ఖాళీ అయిన మైన్ పురి లోక్ సభ స్థానం
- అక్కడి నుంచి పోటీ పడ్డ ములాయం కోడలు
- ఇప్పటికి 55 వేల ఆధిక్యంలో దూసుకెళ్తున్న డింపుల్ యాదవ్
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో ఖాళీ అయిన లోక్ సభ, అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెలువడుతున్నాయి. ఈ ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతోంది. గుజరాత్, హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉత్తరప్రదేశ్ లోని మైన్ పురి లోక్ సభ నియోజవర్గ ఉప ఎన్నిక రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తోంది.
ఇక్కడి నుంచి ములాయం కోడలు, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ బరిలో నిలిచారు. యూపీలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఈ స్థానంపై దృష్టి సారించింది. దాంతో, మైన్ పురిపై అందరి దృష్టి నెలకొంది. ఓట్ల లెక్కింపులో డింపుల్ యాదవ్ భారీ విజయం దిశగా దూసుకెళ్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన సమాచారం మేరకు ఆమె 55 వేల ఓట్ల పైచిలుకు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. యూపీలోని రాంపూర్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికలోనూ ఎస్పీ అభ్యర్థి అసిమ్ రాజా ఆధిక్యంలో ఉన్నారు. ఖతౌలి స్థానంలో ఎస్పీ మిత్ర పక్షమైన ఆర్ ఎల్ డీ అభ్యర్థి ముందంజలో కొనసాగుతున్నారు.