BJP: గుజరాత్ లో ఓట్ల లెక్కింపు పూర్తి... 156 స్థానాలతో బీజేపీ ప్రభంజనం

BJP wins Gujarat assembly elections

  • వరుసగా ఏడోసారి బీజేపీ విజయభేరి
  • గత ఎన్నికల్లో బీజేపీకి 99 స్థానాలు
  • ఈసారి జూలు విదిల్చిన కమలనాథులు
  • కాంగ్రెస్ పార్టీకి 17 స్థానాలు
  • 5 స్థానాలతో ఉనికి చాటుకున్న ఆప్

గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. అధికార బీజేపీ 156 స్థానాలతో విజయభేరి మోగించింది. గత ఎన్నికల్లో 99 సీట్లకే పరిమితమైన బీజేపీ, ఈసారి తిరుగులేని విజయాలతో కాంగ్రెస్ ను మట్టికరిపించింది. కాంగ్రెస్ పార్టీకి 17 స్థానాలు దక్కగా, తొలిసారి గుజరాత్ బరిలో దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ 5 స్థానాలు చేజిక్కించుకుంది. ఇతరులు 4 స్థానాల్లో నెగ్గారు. 

గుజరాత్ అసెంబ్లీ బరిలో బీజేపీ నెగ్గడం ఇది వరుసగా ఏడోసారి. 1995 నుంచి కమలనాథులు ఇక్కడ ఎదురులేని ప్రస్థానం కొనసాగిస్తున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల సొంత రాష్ట్రం కావడంతో గుజరాత్ ఎన్నికలను బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. 

అయితే, పంజాబ్ లో సంచలన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ బరిలో దిగడంతో ఓట్లు చీలే అవకాశం ఉంటుందని, బీజేపీకి నష్టం జరగొచ్చని అంచనా వేశారు. అయితే, అంచనాలను తల్లకిందులు చేస్తూ బీజేపీ భారీ సంఖ్యలో సీట్లను గెలుచుకుని మరోసారి ప్రభుత్వ పీఠాన్ని ఖాయం చేసుకుంది. 

గతంలో వరుసగా ఏడు సార్లు నెగ్గిన ఘనత సీపీఎం పార్టీకి ఉంది. పశ్చిమ బెంగాల్ లో ఆ పార్టీ వరుసగా 7 పర్యాయాలు అధికారం చేజిక్కించుకుంది. ఇప్పుడా రికార్డును బీజేపీ సమం చేసింది. 

గుజరాత్ అసెంబ్లీలో మొత్తం 182 స్థానాలు ఉండగా, మ్యాజిక్ ఫిగర్ 92. అయితే మ్యాజిక్ ఫిగర్ ను మధ్యాహ్నానికే దాటేసిన కాషాయదళం... సాయంత్రానికి 150కి పైగా స్థానాలతో జయకేతనం ఎగురవేసింది. 

అటు, హిమాచల్ ప్రదేశ్ లో అధికార బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజేతగా అవతరించింది. ఈ సాయంత్రానికి ఓట్ల లెక్కింపు పూర్తి కాగా, కాంగ్రెస్ 40 స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీకి 25, ఇతరులకు 3 స్థానాలు దక్కాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్కస్థానం కూడా నెగ్గలేకపోయింది. ఇక్కడి అసెంబ్లీలో మొత్తం స్థానాల సంఖ్య 68.

హిమాచల్ ప్రదేశ్ లో 1985 నుంచి ప్రతి ఎన్నికల్లోనూ ప్రభుత్వాన్ని మార్చడం ఓటర్లకు ఆనవాయతీగా వస్తోంది. వరుసగా రెండు పర్యాయాలు ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. గత ఎన్నికల్లో బీజేపీని గెలిపించిన ప్రజలు, ఈసారి కాంగ్రెస్ కు పట్టం కట్టారు.

  • Loading...

More Telugu News