Pawan Kalyan: నన్ను ఊపిరి తీసుకోవడం కూడా ఆపేయమంటారా?: వైసీపీపై పవన్ ఆగ్రహం
- పవన్ కల్యాణ్ వారాహి రథంపై వైసీపీ విమర్శలు
- తనను అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డ పవన్
- వారాహి విషయంలో కూడా వివాదాన్ని సృష్టిస్తున్నారని ఆగ్రహం
వైసీపీ ప్రభుత్వం తనను అడుగడుగునా అడ్డుకుంటోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. తొలుత తన సినిమాలను అడ్డుకున్నారని విమర్శించారు. తాను విశాఖ పర్యటనకు వెళ్లినప్పుడు తనను వాహనం నుంచి, హోటల్ గది నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారని... సిటీ నుంచి వెళ్లిపోవాలని ఒత్తిడి చేశారని దుయ్యబట్టారు. మంగళగిరిలో తన వాహనం వెళ్లకుండా అడ్డుకున్నారని, కనీసం నడుచుకుంటూ వెళ్లడానికి కూడా లేకుండా ఆటంకాలు కలిగించారని అన్నారు. ఇప్పుడు తన ప్రచార రథం వారాహి విషయంలో కూడా వివాదాన్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు. నన్ను ఊపిరి తీసుకోవడం కూడా ఆపేయమంటారా? అని ప్రశ్నించారు. కనీసం ఈ చొక్కాను అయినా వేసుకోనిస్తారా వైసీపీ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలివ్ గ్రీన్ కలర్ లో ఉన్న చొక్కాను ఆయన షేర్ చేశారు.
పవన్ కల్యాణ్ వారాహి వాహనం ఆలివ్ గ్రీన్ కలర్ లో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో, వైసీపీ నేతలు విమర్శలు మొదలుపెట్టారు. వారాహికి తెలుపు, నలుపు, మరో రంగు కాకుండా పసుపు రంగు వేసుకుంటే సరిపోతుందని మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. ఆలివ్ గ్రీన్ రంగు కేవలం మిలిటరీ వాహనాలకు మాత్రమే వాడతారని... వారాహికి ఆ రంగు వేయడం చట్ట విరుద్ధమని అన్నారు. లక్షల పుస్తకాలు చదివానని చెప్పుకునే పవన్ కల్యాణ్ కు మోటార్ వెహికల్ యాక్ట్ పుస్తకాన్ని చదివే సమయం దొరకలేదా? అని ప్రశ్నించారు. డబ్బులు ఉన్న ప్రతి ఒక్కరూ వ్యాన్లను కొనుక్కుని యుద్ధం చేస్తామంటే కుదరదని అన్నారు. ఇలాంటివి సినిమాల్లో నడుస్తాయని, నిజ జీవితంలో కుదరవని చెప్పారు. ఇలాంటి విమర్శల నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ వైసీపీపై ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.