Google India: యూట్యూబ్‌లో అశ్లీల ప్రకటనలు చూసి పరీక్ష తప్పానంటూ కోర్టుకెక్కిన యువకుడు.. షాకిచ్చిన సుప్రీంకోర్టు
- గూగుల్ ఇండియా నుంచి రూ. 75 లక్షల పరిహారం కోరిన మధ్యప్రదేశ్ వాసి
- ఆ ప్రకటనలు ఎవరు చూడమన్నారని నిలదీసిన న్యాయస్థానం
- పిటిషనర్‌కు రూ. లక్ష జరిమానా
- అంత చెల్లించలేననడంతో రూ. 25 వేలకు తగ్గింపు
యూట్యూబ్‌లో వచ్చే అశ్లీల ప్రకటనల కారణంగా తాను పోటీ పరీక్షల్లో తప్పానని, కాబట్టి గూగుల్ ఇండియా నుంచి తనకు రూ. 75 లక్షల పరిహారం ఇప్పించాలన్న యువకుడికి సుప్రీంకోర్టు షాకిచ్చింది. మధ్యప్రదేశ్‌కు చెందిన యువకుడు ఈ పిటిషన్ వేశాడు. ఈ వ్యాజ్యంపై అత్యున్నత ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వాటితో న్యాయవ్యవస్థ సమయం వృథా అవుతోందన్న కోర్టు.. పిటిషన్‌ను కొట్టివేసింది.
ఈ సందర్భంగా కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేయడంతోపాటు పిటిషనర్‌కు జరిమానా కూడా విధించింది. ఇంటర్నెట్ ప్రకటనలు చూసి పోటీ పరీక్షల్లో విఫలం కావడం ఏంటని పిటిషనర్‌ను ప్రశ్నించిన న్యాయస్థానం.. అసలు ఆ ప్రకటనలను ఎవరు చూడమన్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతకంటే ఘోరమైన పిటిషన్ మరోటి ఉండదని మండిపడుతూ పిటిషనర్‌కు లక్ష రూపాయల జరిమానా విధిస్తూ జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ ఏఎస్ ఓకాతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది. అయితే, తాను నిరుద్యోగినని, అంత జరిమానా చెల్లించలేనని పిటిషనర్ ప్రాధేయపడడంతో దానిని రూ. 25 వేలకు తగ్గించింది.