punjab: పంజాబ్ లోని పోలీస్ స్టేషన్ పై రాకెట్ దాడి!
- ఎలాంటి నష్టం వాటిల్లలేదని వివరించిన పోలీసులు
- రాష్ట్రవ్యాప్తంగా అలర్ట్ ప్రకటించిన ఉన్నతాధికారులు
- ఖలిస్థాన్ అనుకూల ఉగ్రవాదుల పనేనని అనుమానాలు
- ఐఎస్ఐ పాత్ర కూడా ఉండొచ్చంటున్న ఇంటెలిజెన్స్ వర్గాలు
పాకిస్థాన్ సరిహద్దులకు దగ్గర్లో ఉన్న తరణ్ తరణ్ లోని ఓ పోలీస్ స్టేషన్ పై రాకెట్ దాడి జరిగింది. తేలికపాటి రాకెట్ తో ఉగ్రవాదులు దాడి చేశారని పోలీసులు తెలిపారు. అదృష్టవశాత్తూ ఈ దాడిలో తమ సిబ్బందికి ఎలాంటి హానీ జరగలేదని వివరించారు. ఖలిస్థాన్ అనుకూల ఉగ్రవాదులే ఈ రాకెట్ దాడికి పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, పాకిస్థాన్ సరిహద్దుకు దగ్గర్లో ఉన్న స్టేషన్ పై దాడి జరగడంతో ఐఎస్ఐ ఉగ్రవాదుల పాత్ర కూడా ఉండొచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు సందేహిస్తున్నాయి.
ఖలిస్థాన్ అనుకూల ఉగ్రవాది హర్విందర్ సింగ్ అలియాస్ రిండా సొంతూరులో ఈ రాకెట్ దాడి జరిగింది. రిండా మరణించినట్లు ఇటీవల వార్తలు వెలువడ్డాయి. ఈ వార్తలను పోలీసులు ధ్రువీకరించలేదు. ఈ నేపథ్యంలో రిండా ప్రాణాలతో ఉండాలని ఐఎస్ఐ కోరుకుంటోందని, రిండాకు హాని తలపెట్టొద్దనే హెచ్చరిక పంపేందుకే తాజా రాకెట్ దాడి జరిపినట్లు ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. కాగా, పోలీస్ స్టేషన్ పై రాకెట్ దాడి నేపథ్యంలో పంజాబ్ పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఈ ఏడాది మే లో ఏకంగా మొహాలీలోని పంజాబ్ ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయంపైనే ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. అప్పుడు కూడా ఉగ్రవాదులు ఇలాగే తేలికపాటి రాకెట్ తో దాడి చేశారు. అయితే, ఆ దాడిలోనూ ఎవరికీ ఎలాంటి హాని కలగలేదని పోలీసులు చెప్పారు.