Kollu Ravindra: పెద్దిరెడ్డి కుర్చీలో కూర్చుని మాట్లాడితే బీసీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు నిల్చుని మాట్లాడడం అవమానకరం: కొల్లు రవీంద్ర
- ఇటీవల వైసీపీ జయహో బీసీ సభ
- బీసీలకు పెద్ద పీట వేస్తామని జగన్ అన్నారన్న రవీంద్ర
- పెద్ద పీట అంటే నిల్చోబెట్టి అవమానించడమేనా అని ఆగ్రహం
ఇటీవల విజయవాడలో వైసీపీ జయహో బీసీ సభ నిర్వహించడం తెలిసిందే. దీనిపై టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. బీసీలకు పెద్ద పీట వేస్తామని విజయవాడ సాక్షిగా జగన్ రెడ్డి బహిరంగంగా ప్రకటించారని, పెద్ద పీట వేయడమంటే నిల్చోపెట్టి అవమానించడమేనా? అని ప్రశ్నించారు. ఈ సభలో మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి కుర్చీలో కూర్చొని మాట్లాడుతుంటే బీసీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు నిలబడి మాట్లాడటం యావత్ బీసీ సోదరులందరికి అవమానకరం అని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఇదేనా బీసీల పట్ల మీకున్న గౌరవం? అని నిలదీశారు.
"ఒక బీసీ మంత్రిని మోకాళ్లపై కూర్చునేలా చేశారు... బడుగు బలహీన మంత్రుల అధికారాలను లాక్కొని సామంతరాజులకు జగన్ రెడ్డి అప్పగించారు. కేవలం 42 నెలల్లో 26 మంది బీసీలను హత్య చేశారు, 2650 మంది బీసీ సోదరులపై దాడులకు పాల్పడ్డారు. బీసీలను అణచివేసి మీ అదుపులో పెట్టుకోవాలని చూస్తున్నారు. బీసీ పీకలపై కత్తులు పెట్టి మీ స్వార్ధానికి వాడుకొని కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు. బీసీల దమ్మేంటో మీకు త్వరలోనే చూపిస్తాం. మీ స్వార్ధపూరిత రాజకీయాలను బీసీలు గమనిస్తున్నారు" అంటూ కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీకి బీసీలంటే ఓటు బ్యాంక్ మాత్రమే గాని బ్యాక్ బోన్ కాదు అని స్పష్టం చేశారు.