Ashok Babu: ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం సీఎం జగన్ నిస్సిగ్గుగా దొంగ ఓట్లు నమోదు చేయించారు: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు

Ashok Babu and AS Ramakrsihna slams CM Jagan over MLC voter registration

  • వచ్చే ఏడాది మార్చిలో ఎమ్మెల్సీ ఎన్నికలు
  • ముగిసిన ఓటర్ల నమోదు
  • అనర్హులను ఓటర్లుగా నమోదు చేయించారన్న టీడీపీ నేతలు

ఏపీలో వచ్చే ఏడాది మార్చిలో 3 గ్రాడ్యుయేట్ స్థానాలు, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం సీఎం జగన్ నిస్సిగ్గుగా దొంగ ఓట్లు నమోదు చేయించారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ ధ్వజమెత్తారు. పొరపాటున వైసీపీ బలపరిచిన అభ్యర్థులు గెలిస్తే ప్రజాస్వామ్యం చచ్చినట్టేనని అభిప్రాయపడ్డారు. 

మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో  వారు మీడియాతో మాట్లాడారు. గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం జగన్ రెడ్డి, ఆయన పార్టీ నేతలు, వాలంటీర్లు, అధికారులు కలిసి కుట్రలకు పాల్పడుతున్నారని, అనర్హులను కూడా గ్రాడ్యుయేట్ ఓటర్లుగా నమోదు చేయించారని అశోక్ బాబు ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మన రాష్ట్రంలో తప్ప మరే రాష్ట్రంలో ఫిర్యాదులు లేవు అని వివరించారు. 

"ఏపీలో జరిగిన గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదులో మాత్రం లెక్కకు మిక్కిలి అవకతవకలు జరిగాయని ఎన్నికల సంఘమే అభిప్రాయపడింది. దరఖాస్తులు వచ్చినంత వేగంగా, ప్రభుత్వ కార్యాలయాల్లో ఓటర్లుగా నమోదు కావడానికి వచ్చే గ్రాడ్యుయేట్ల సందడి కనిపించకపోవడం కూడా పలు అనుమానాలకు తావిచ్చింది. దొంగ ఓట్ల నమోదులో ప్రమేయం ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల్ని వదిలిపెట్టేది లేదు. వారిపై కూడా ఆధారాలతో సహా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేస్తాం. 63 వేల బోగస్ ఓట్లు నమోదుకావడంపై వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి" అని అశోక్ బాబు డిమాండ్ చేశారు.

మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ మాట్లాడుతూ, టెర్రరిజం విధానాలతోనే వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డి 175 స్థానాలు గెలవాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. “ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్, ఇరాక్, శ్రీలంక వంటి దేశాల్లో టెర్రరిజం ఎక్కువగా ఉంటుందని చెప్పుకునేవాళ్లం. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆయన ప్రభుత్వం రాష్ట్రంలోనే టెర్రరిజాన్ని పెంచి పోషిస్తోంది. 

వాలంటీర్ వ్యవస్థద్వారా ఏమైనా చేయొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ప్రజలకు అవసరంలేని ఒక వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి ఎందుకు సృష్టించారో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారి ద్వారా జరిగిన ఓటర్ల నమోదు ప్రక్రియ చూస్తే అర్థమవుతుంది" అని విమర్శించారు.

  • Loading...

More Telugu News