Konda Surekha: నిన్న ఎగ్జిక్యూటివ్ కమిటీలో స్థానం... నేడు రాజీనామా చేసిన కొండా సురేఖ
- నిన్న పీసీసీ కమిటీలు ప్రకటించిన కాంగ్రెస్ హైకమాండ్
- కొండా సురేఖకు ఎగ్జిక్యూటివ్ కమిటీలో స్థానం
- పొలిటికల్ అఫైర్స్ కమిటీలో స్థానం కల్పించనందుకు సురేఖ అలక
- తనకంటే జూనియర్లకు పీఏసీలో స్థానం కల్పించారని అసంతృప్తి
తెలంగాణ పీసీసీకి సంబంధించి కాంగ్రెస్ అధిష్ఠానం నిన్న పలు కమిటీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి కొండా సురేఖకు ఎగ్జిక్యూటివ్ కమిటీలో స్థానం కల్పించారు. అయితే, పొలిటికల్ అఫైర్స్ కమిటీకి తనను ఎంపిక చేయకపోవడం పట్ల కొండా సురేఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
తన కంటే జూనియర్లకు పొలిటికల్ అఫైర్స్ కమిటీలో స్థానం కల్పించారని ఆమె ఆరోపించారు. ఇది తనను తీవ్రంగా అవమానించడమేనని పేర్కొన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఓసారి మంత్రిగా పనిచేశానని, తన భర్త కొండా మురళి ఎమ్మెల్సీగా చేశారని, తమ కుటుంబానికి రాష్ట్రంలో ఎంతో పేరుందని అన్నారు.
కానీ, తనను ఎగ్జిక్యూటివ్ కమిటీలో వేయడం బాధించిందని కొండా సురేఖ వాపోయారు. ఎమ్మెల్యేలుగా కూడా గెలవని వారు ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉన్నారని, తనను కూడా వారితో పాటే పరిగణించడం అసంతృప్తి కలిగించిందని అన్నారు. తన సీనియారిటీని తగ్గించి ఆ కమిటీలో వేశారని, అందుకే పీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని వివరించారు.