Dev Joshi: జపాన్ కుబేరుడి జాబిల్లి యాత్రకు భారత నటుడికి పిలుపు
- 2023లో స్పేస్ ఎక్స్ రాకెట్ సాయంతో యాత్ర
- స్పేస్ షిప్ రూపొందించిన జపాన్ స్టార్టప్ ఐస్పేస్
- ప్రపంచవ్యాప్తంగా దరఖాస్తులకు ఆహ్వానం
- 249 దేశాల నుంచి 10 లక్షల దరఖాస్తులు
- 10 మంది ప్రముఖుల ఎంపిక
జపాన్ కు చెందిన ఐస్పేస్ అనే స్టార్టప్ వచ్చే ఏడాది చంద్రుడిపైకి యాత్ర తలపెట్టింది. ఓ ప్రైవేటు సంస్థ జాబిల్లిపైకి పర్యాటక యాత్ర జరపనుండడం ఇదే ప్రథమం. 2023 ఏప్రిల్ లో ఈ రోదసి యాత్ర చేపట్టనున్నారు. అందుకోసం ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ రాకెట్ ను ఉపయోగించనున్నారు.
ఐస్పేస్ స్టార్టప్ రూపొందించిన హకుటో-ఆర్ స్పేస్ షిప్ ను స్పేస్-ఎక్స్ రాకెట్ అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది. ఈ యాత్రకు 'డియర్ మూన్ మిషన్' అని పేరుపెట్టారు. కాగా, ఈ మూన్ మిషన్ ను జపాన్ కుబేరుడు యుసాకు మియజావా స్పాన్సర్ చేస్తున్నారు.
ఆయన ఈ జాబిల్లి యాత్రలో పాల్గొనే వారి కోసం ప్రపంచవ్యాప్తంగా దరఖాస్తులను ఆహ్వానించగా, భారత్ కు చెందిన నటుడు దేవ్ జోషి ఎంపికయ్యారు. 249 దేశాల నుంచి వచ్చిన 10 లక్షల దరఖాస్తులను పరిశీలించి 10 మంది సెలబ్రిటీలను ఎంపిక చేయగా, వారిలో దేవ్ జోషి కూడా ఉన్నారు. ఫాంటసీ టెలివిజన్ సీరియల్ బాలవీర్ తో దేవ్ జోషి ఎంతో పాప్యులారిటీ సంపాదించుకున్నారు.