Madhya Pradesh: ర్యాగింగ్ కేసును ఛేదించడానికి స్టూడెంట్ అవతారమెత్తిన మహిళా కానిస్టేబుల్
- 3 నెలలు క్యాంపస్ లో తిరిగినా ఒక్కరూ అనుమానించలేదు
- బీకామ్ గ్రాడ్యుయేట్ అయినా నర్సింగ్ స్టూడెంట్ గా నటించింది
- విద్యార్థులు, క్యాంటీన్ సిబ్బందితో కబుర్లు చెబుతూ వివరాలు రాబట్టిన వైనం
- పదకొండు మంది సీనియర్లకు వ్యతిరేకంగా సాక్ష్యాలు సేకరించిన కానిస్టేబుల్ షాలిని
మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కేసును సాల్వ్ చేయడానికి విద్యార్థినిగా మారిందో కానిస్టేబుల్.. 3 నెలల పాటు భుజాన ఓ బ్యాగ్ వేసుకుని క్యాంపస్ లో తిరిగింది. క్యాంటీన్ లో మిగతా విద్యార్థులతో కబుర్లు చెప్పింది. ఏ ఒక్కరికీ కించిత్ అనుమానం రాకుండా ప్రవర్తించింది. ఆధారాల్లేకపోవడంతో 5 నెలలుగా ముందుకు కదలని ఓ కేసును కొలిక్కి తెచ్చింది. నిందితులు పదకొండు మంది సీనియర్ స్టూడెంట్లకు వ్యతిరేకంగా సాక్ష్యాలు సంపాదించి, ఉన్నతాధికారులకు అందించింది. ర్యాగింగ్ కేసులో విచారించాలి.. స్టేషన్ కు రమ్మంటూ గురువారం నోటీసులు అందుకున్న ఆ తొమ్మిది మంది స్టూడెంట్లు కంగుతిన్నారు. సినిమా స్టోరీని తలపించే ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జరిగింది.
ఇండోర్ లోని ఎంజీఎం మెడికల్ కాలేజీలో సీనియర్ల ర్యాగింగ్ శ్రుతిమించుతోందని పోలీసులకు ఫిర్యాదులు అందాయి. సీనియర్లు తాము ఉండే ప్రాంతానికి పిలిచి మరీ అభ్యంతరకరంగా ర్యాగింగ్ చేస్తున్నారని జూనియర్లు ఆరోపించారు. అయితే, పోలీసు కేసు పెడితే తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయోనని భయపడి, మిన్నకుండిపోతున్నారు. తమ పేరు బయటకు రాకుండా ర్యాగింగ్ వివరాలను, గూగుల్ మ్యాప్ లొకేషన్ లను పోలీసులకు పంపించి చర్యలు తీసుకోవాలని ప్రాధేయపడ్డారు. ఇలాంటి ఓ కేసును ఛేదించడానికి పోలీసులు అండర్ కవర్ ఆపరేషన్ చేపట్టారు.
డిపార్ట్ మెంట్ లో కొత్తగా జాయిన్ అయిన షాలిని చౌహాన్, సంజయ్, రింకూలతో పాటు మరికొందరిని ఉన్నతాధికారులు ఈ ఆపరేషన్ కు ఎంపిక చేశారు. ఇందులో భాగంగా 24 ఏళ్ల షాలిని విద్యార్థినిలాగా మారిపోయింది. భుజాన బ్యాగ్, అందులో పుస్తకాలు, ముఖాన చిరునవ్వుతో ఎంజీఎం క్యాంపస్ లో అడుగుపెట్టింది. రోజుకు నాలుగైదు గంటలు క్యాంటీన్ లో గడుపుతూ విద్యార్థులతో మాట్లాడింది. అనుమానితులు 11 మంది సీనియర్ స్టూడెంట్ల కదలికలను, వారి చర్యలను నిత్యం ఓ కంట కనిపెట్టింది.
బీకామ్ గ్రాడ్యుయేట్ అయిన షాలిని ఈ ఆపరేషన్ కోసం నర్సింగ్ స్టూడెంట్ గా నటించాల్సి వచ్చింది. ఈ ఆపరేషన్ లో మిగతా వాళ్లు ఎప్పటికప్పుడు అందించే సమాచారంతో, నెట్ లో సేకరించిన సమాచారం కలిపి తోటి వాళ్లతో మాట్లాడుతూ కవర్ చేసింది. మూడు నెలల పాటు క్యాంపస్ లో తిరిగినా షాలినీని ఎవ్వరూ అనుమానించలేదు. ఆమె నర్సింగ్ స్టూడెంట్ కాదని ఒక్కరికీ అనుమానమే రాలేదంటే ఎంతబాగా నటించిందో అర్థం చేసుకోవచ్చు.
ఆ పదకొండు మంది సీనియర్ స్టూడెంట్లకు వ్యతిరేకంగా తగిన సాక్ష్యాలు సేకరించిన తర్వాత షాలిని వాటిని ఉన్నతాధికారులకు అందజేసింది. స్టూడెంట్లను ర్యాగింగ్ చేయడానికి వాట్సాప్ లలో తాము ఉండే రూమ్ లొకేషన్ పంపి, అక్కడికి రావాలని సీనియర్లు బెదిరించేవారు. ఈ వాట్సాప్ సంభాషణల స్క్రీన్ షాట్లు, గూగుల్ లొకేషన్ తదితర వివరాల ఆధారంగా ఆ పదకొండు మందికి పోలీసులు నోటీసులు పంపించారు. స్టేషన్ కు వచ్చి విచారణకు సహకరించాలని అందులో సూచించారు. వాళ్లను విచారిస్తే మరింతమంది స్టూడెంట్ల వివరాలు బయటపడొచ్చని పోలీసులు భావిస్తున్నారు. విచారణ సమయంలో షాలినిని పోలీస్ డ్రెస్ లో చూసి ఆ పదకొండు మంది ఎలా స్పందిస్తారో చూడాలి.