Suchitra Chandra Bose: నేను ఎవరనేది చెప్పగానే చిరంజీవి షాక్ అయ్యారు: సీనియర్ కొరియోగ్రఫర్ సుచిత్ర చంద్రబోస్
- తమ తండ్రి మాస్టర్ వేణు దగ్గర పనిచేశారన్న సుచిత్ర
- తమ ఇంట్లో చిరంజీవిగారు రెంట్ కి ఉన్నారని వెల్లడి
- తర్వాత ఎస్వీ కృష్ణారెడ్డి అదే రూములో వున్నారని చెప్పిన సుచిత్ర
- తొలిసారిగా చిరంజీవిని ఘరానామొగుడు షూటింగులో కలిశానని వెల్లడి
టాలీవుడ్ లోని సీనియర్ కొరియోగ్రఫర్స్ లో సుచిత్ర చంద్రబోస్ ఒకరు. ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ శ్రీమతి ఆమె. దాదాపు 500 సినిమాల్లో .. రెండు వేల పాటలకు ఆమె కొరియోగ్రఫీని అందించారు. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుచిత్ర మాట్లాడుతూ, తనకి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.
"ఒకప్పటి మ్యూజిక్ డైరెక్టర్ .. భానుచందర్ గారి ఫాదర్ మాస్టర్ వేణు గారి దగ్గర మా నాన్నగారు అసిస్టెంట్ గా వర్క్ చేసేవారు. అందువలన మేము బందరు సమీపంలోని ఒక గ్రామం నుంచి చెన్నై కి వెళ్లడం జరిగింది. ఆ తరువాత కాలంలో మా ఇంట్లోనే పైన ఉన్న ఒక రూములో చిరంజీవిగారు .. సుధాకర్ గారు .. హరిప్రసాద్ గారు రెంట్ కి ఉండేవారు. అప్పటికి నేను చిన్నపిల్లని. వాళ్ల తరువాత అదే రూములో ఎస్వీ కృష్ణారెడ్డి గారు కొంతకాలం ఉన్నారు" అని అన్నారు.
"ఎస్వీ కృష్ణారెడ్డి గారితో ఉన్న పరిచయం కారణంగానే, ఆయన నాకు 'కొబ్బరిబొండం' సినిమాతో కొరియోగ్రఫర్ గా ఛాన్స్ ఇచ్చారు. నా వర్క్ నచ్చడం వలన వరుస అవకాశాలను ఇచ్చారు. ఒకసారి నేను అన్నపూర్ణ స్టూడియోలో షూటింగులో ఉండగా, మరో వైపున చిరంజీవిగారి 'ఘరానా మొగుడు' షూటింగు జరుగుతోంది. వెంటనే నేను వెళ్లి ఆయనను కలుసుకున్నాను. నేను ఎవరన్నది చెప్పగానే ఆయన షాక్ అయ్యారు. వెంటనే 'ఘరానా మొగుడు' సినిమాలోని 'హేయ్ పిల్లా .. హల్లో పిల్లా' అనే పాటను చేసే ఛాన్స్ ఇచ్చారు. నన్ను స్టార్ కొరియోగ్రఫర్ ను చేసింది చిరంజీవిగారే" అని చెప్పుకొచ్చారు.