Rishabh Pant: ఫామ్ లోకి వచ్చేందుకు కఠోరంగా శ్రమిస్తున్న రిషబ్ పంత్
- కొన్నాళ్లుగా నిరాశ పరుస్తున్న పంత్
- బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ కు దూరంగా ఉన్న కీపర్
- బుధవారం బంగ్లాతో తొలి టెస్టు ఆడనున్న భారత్
ఫామ్ కోల్పోయి కొంతకాలంగా నిరాశ పరుస్తూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న భారత యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తిరిగి గాడిలో పడేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. బంగ్లాదేశ్ తో బుధవారం మొదలయ్యే తొలి టెస్టులో ఎలాగైనా సత్తా చాటాలని ఆశిస్తున్నాడు. ఈ క్రమంలో నెట్స్ లో అతను కఠోరంగా శ్రమిస్తున్నాడు. తొలి మ్యాచ్ కోసం భారత్ ప్రాక్టీస్ ప్రారంభించగా.. రిషబ్ పంత్ నెట్స్ లో చాలా సేపు బ్యాటింగ్ చేస్తూ కనిపించాడు. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఈ సెషన్ ను పర్యవేక్షించి అతనికి తగు సూచనలు చేశాడు.
బంగ్లాతో వన్డే సిరీస్ కు దూరంగా ఉన్న పంత్ టెస్టుల్లో ఎలా రాణిస్తాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గాయం కారణంగా రోహిత్ శర్మ ఈ మ్యాచ్ కు దూరంగా ఉంటున్నాడు. అతని స్థానంలో వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. రాహుల్ కూడా నెట్స్ లో తీవ్రంగా ప్రాక్టీస్ చేశాడు. రాహుల్ తో పాటు ఓపెనర్ గా రాబోతున్న శుభ్ మన్ గిల్ కూడా నెట్ బౌలర్లను ఎదుర్కొన్నాడు.