Varahi: పవన్ కల్యాణ్ 'వారాహి' వాహనానికి తెలంగాణ రవాణా శాఖ అనుమతులు
- త్వరలో జనసేనాని బస్సు యాత్ర
- వారాహి పేరిట వాహనం సిద్ధం
- వైసీపీ అభ్యంతరాలు
- వారం కిందటే వారాహి రిజిస్ట్రేషన్ పూర్తయిందన్న రవాణా శాఖ
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తలపెట్టిన బస్సు యాత్ర కోసం వారాహి అనే వాహనాన్ని సిద్ధం చేయడం తెలిసిందే. అయితే ఈ వాహనం రంగుపై ఏపీ అధికార పక్ష నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మిలిటరీ వాహనాలకు వేసే ఆలివ్ గ్రీన్ రంగును ప్రైవేటు వాహనాలకు ఎలా వేస్తారంటూ వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. దీనిపై పవన్ కల్యాణ్ కూడా వైసీపీ నేతలకు ఘాటుగా బదులిచ్చారు.
ఈ నేపథ్యంలో, వారాహి వాహనానికి క్లియరెన్స్ లభించింది. వారాహి వాహనానికి రవాణా శాఖకు సంబంధించిన అన్ని అనుమతులు ఉన్నాయని తెలంగాణ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పాపారావు వెల్లడించారు. వారం రోజుల క్రితమే వారాహి వాహనం రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకుందని తెలిపారు. వాహనం బాడీకి సంబంధించిన సర్టిఫికెట్ ను పరిశీలించామని పేర్కొన్నారు.
కాగా, వారాహి వాహనానికి తెలంగాణ రవాణా శాఖ TS 13 EX 8384 నెంబరు కేటాయించినట్టు తెలుస్తోంది. అంతేకాదు, జనసేన వాహనం రంగు 'ఆలివ్ గ్రీన్' కాదని, 'ఎమరాల్డ్ గ్రీన్' అని రవాణా శాఖ స్పష్టత ఇచ్చింది. ఇది నిబంధనలకు లోబడే ఉందని తెలిపింది.
కేంద్ర మోటారు వాహనాల చట్టం ప్రకారం రక్షణ శాఖకు చెందిన వాహనాలకు మాత్రమే ఆలివ్ గ్రీన్ రంగు పెయింటింగ్ వాడాల్సి ఉంటుంది. ఇతర ప్రైవేటు వాహనాలకు, వ్యవసాయ ట్రాక్టర్లకు ఈ రంగు వేయరాదు. అయితే, పవన్ వారాహి వాహనం రంగు ఎమరాల్డ్ గ్రీన్ అని రవాణా శాఖ పేర్కొనడంతో దీనిపై నెలకొన్న వివాదం ముగిసినట్టయింది.