Vikrama Simhapuri University: 800 మార్కులకు 5,360.. సింహపురి యూనివర్సిటీలో వింత!
- 8 నెలల క్రితం డిగ్రీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు
- తాజాగా ఫలితాలు వెల్లడించిన అధికారులు
- అన్నీ తప్పుల తడకే
- ఒక్కొక్కరికీ 2 వేలకు పైగానే మార్కులు
నెల్లూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీలో వింత చోటుచేసుకుంది. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో విద్యార్థులకు 800 మార్కులకు గాను 2 వేలకు పైనే మార్కులు వచ్చాయి. ఓ విద్యార్థికైతే ఏకంగా 5,360 మార్కులు వచ్చాయి. ఆ మార్కులు చూసిన విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. తాము ఏ గ్రేడ్‌లో పాసయ్యామో తెలియక డిగ్రీ విద్యార్థులు తలలు పట్టుకుంటున్నారు.
యూనివర్సిటీలో 8 నెలల క్రితం డిగ్రీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించారు. తాజాగా, ఈ ఫలితాలను వెల్లడించారు. 8 నెలల తర్వాత ఫలితాలు వెల్లడించినప్పటికీ మార్కులు తప్పుల తడకగా ఉండడంపై విద్యార్థులు మండిపడుతున్నారు. విద్యార్థులందరికీ ఇలా 2 వేలకు పైగానే మార్కులు రావడంతో యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై యూనివర్సిటీ రిజిస్ట్రార్ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. మార్కుల జాబితాలో తప్పులుంటే సవరించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.