Ayodhya: అయోధ్య మసీదు డిజైన్ చూశారా.. అదిరిందిగా..!
- అయోధ్య సమీపంలోని దన్నిపూర్ లో నిర్మాణం
- స్థల వినియోగానికి లభించిన అనుమతి
- అగ్ని ప్రమాద క్లియరెన్స్ వస్తే నిర్మాణం ప్రారంభం
అయోధ్యలో అతిపెద్ద, అధునాతన మసీదు నిర్మాణానికి అడ్డంకి తొలగిపోయింది. 2019లో అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో (బాబ్రీ మసీదు కూల్చివేసిన) రామాలయం నిర్మాణానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం తెలిసిందే. అలాగే, అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి వీలుగా ఐదు ఎకరాల స్థలాన్ని సున్నీ వక్ఫ్ బోర్డుకు ఇవ్వాలన్న ఆదేశాలు జారీ చేసింది.
అయోధ్య సమీపంలోని లక్నో-ఫైజాబాద్ హైవే పక్కన, దన్నిపూర్ గ్రామంలో మసీదు నిర్మాణం ప్రారంభం కానుంది. స్థలాన్ని మసీదు నిర్మాణానికి వినియోగించుకునేందుకు అనుమతి కోసం ఎంతో కాలంగా చూస్తున్నామని, ఎట్టకేలకు అయోధ్య డెవలప్ మెంట్ అథారిటీ నుంచి అనుమతి వచ్చినట్టు ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ సెక్రటరీ ఆథర్ హుస్సేన్ ప్రకటించారు.
ఇంకా అగ్ని ప్రమాదం అనుమతి ఒక్కటే మిగిలి ఉన్నట్టు చెప్పారు. తాము కేవలం మసీదు ఒక్కటే కాకుండా, 200 పడకల హాస్పిటల్ కూడా నిర్మిస్తామని హుస్సేన్ తెలిపారు. మొదటి దశలో రూ.100 కోట్లు, రెండో దశలో రూ.100 కోట్లు వెచ్చిస్తామన్నారు. మసీదుకు సంబంధించి వెలుగులోకి వచ్చిన డిజైన్ ఎంతో అధునాతనంగా, ఆకర్షణీయంగా ఉండడం గమనార్హం.