Jagan: సీఎం జగన్ అధ్యక్షతన ప్రారంభమైన ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం!
- సచివాలయం మొదటి బ్లాక్ లో కేబినెట్ సమావేశం
- ప్రగతి పనులు, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై చర్చ
- జేఎస్ డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ కు ఆమోదం తెలపనున్న కేబినెట్
ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమయింది. సచివాలయం మొదటి బ్లాక్ లో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రగతి పనులు, అభివృద్ది కార్యక్రమాల అమలుపై చర్చ జరిగే అవకాశం ఉంది. మూడు రాజధానులు, సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు, ఆమోదించాల్సి బిల్లులు, అసెంబ్లీ శీతాకాల సమావేశాల నిర్వహణ తదితర అంశాలపై చర్చించనున్నారు.
అలాగే కడప సున్నపురాళ్లపల్లెలో జేఎస్ డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఉత్తరాంధ్రలో అదానీ గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుపై చర్చించనున్నారు. సంక్షేమ పథకాల అమలుపై సమీక్ష నిర్వహించనున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చి మూడున్నరేళ్లు అవుతున్న సందర్భంగా ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంది. దీంతో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు మంత్రులతో జగన్ ప్రత్యేకంగా మాట్లాడబోతున్నట్టు సమాచారం.